వైఎస్సార్ కాంగ్రెస్ నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోగ్యం గత కొద్దిరోజులుగా కలవరపెడుతోంది. కొన్ని రోజులుగా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిని ఆశ్రయించారు. ప్రాథమిక పరీక్షల అనంతరం, ఆయన గుండెల్లో మూడు వాల్వుల్లో సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పరిస్థితి దృష్ట్యా, స్టంట్ వేయడం లేదా బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మెరుగైన చికిత్స కోసం కొడాలి నానిని కుటుంబసభ్యులు ముంబైకి తరలించారు. ముంబైలోని ఏషియన్ హార్ట్‌కేర్ ఇనిస్టిట్యూట్‌లో జూలై 2వ తేదీన ఆయనకు బైపాస్ శస్త్రచికిత్స జరిగింది. ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో ఈ ఆపరేషన్ దాదాపు 10 గంటల పాటు సాగింది. సర్జరీ విజయవంతంగా పూర్తయిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం కొడాలి నాని ఐసీయూలోనే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. అవయవాలన్నీ సరిగా స్పందిస్తున్నాయని, త్వరలో సాధారణ వార్డుకు మారే అవకాశముందని వైద్యులు తెలియజేశారు. అయితే పూర్తి ఆరోగ్యంగా మారేందుకు ఆయనకు కనీసం మరో నెల రోజులపాటు విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో ఆయన ముంబైలోనే ఉండే అవకాశముంది.
వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మండలి హనుమంతరావు మాట్లాడుతూ, నాని ఆరోగ్యం మెరుగవుతోందని తెలిపారు. పార్టీ శ్రేణులు, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం నానిపై ఎలాంటి రాజకీయ ఒత్తిడులూ లేకుండా వైద్యం జరగాలన్నదే కుటుంబసభ్యుల ఆశయం. వచ్చే నెలలో నాని పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజల్లో కనిపిస్తారని ఆశిస్తున్నారు.