వైసీపీ నేతలకు “రెడ్ బుక్” పేరు వినగానే గుండెల్లో బెంబేలు అలుముతాయని మంత్రి నారా లోకేశ్ మరోసారి విమర్శలదాడి చేశారు. ఉండవల్లిలో ఓ నిరుపేద కుటుంబానికి పట్టా పత్రాలు అందించిన అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేశ్, గత వైసీపీ పాలనను విమర్శిస్తూ… చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారిపైనే రెడ్ బుక్ ఉంటుంది అన్నారు. తప్పుడు ప్రచారాలపై వారిని ఉద్దేశించి వ్యంగ్యంగా స్పందించారు.
కనిగిరిలో రిలయన్స్ సీబీజీ ప్లాంట్ ప్రారంభంపై ఆయన మాట్లాడుతూ, ఇది వలసలు వెళ్లిన ప్రజలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తీసుకున్న నిర్ణయమని చెప్పారు. వైసీపీ నేతలు ఈ అభివృద్ధిని చూడలేక తప్పుడు వార్తలు పెడుతున్నారని ఆరోపించారు. ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సహకారంతో రైతులు భూములు ఇస్తున్నారని, ఇకపై మరిన్ని ప్లాంట్లు నెలకొల్పనున్నట్లు తెలిపారు.
జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన లోకేశ్, “తల్లి, చెల్లిని కలవలేని వ్యక్తి ప్రజలకు ఎలా సేవ చేస్తాడు?” అంటూ ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే, తన నివాస ప్రాంతంలోనే సమస్యలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. జనం మధ్య తిరిగే ధైర్యం జగన్‌కు లేదని ఎద్దేవా చేశారు.
పాస్టర్ ప్రవీణ్ మృతిపై అసత్య ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తప్పవని తెలిపారు. ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం సామాజిక సమరసతకు భంగం కలిగించేలా వ్యవహరించిందని, టీడీపీ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో అందించేందుకు పని చేస్తుందని పేర్కొన్నారు.