AP: దగ్గుబాటి హీరోలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు… ఆ భూములన్ని వెనక్కి ఇవ్వాలంటూ?

AP: ఏపీ సర్కారు హీరో దగ్గుబాటి వెంకటేష్ కుటుంబానికి ఊహించని షాక్ ఇచ్చింది. రామానాయుడు స్టూడియో కోసం కేటాయించిన భూములను తిరిగి వెనక్కి ఇవ్వాలి అంటూ ఏపీ సర్కార్ ఆదేశాలను జారీ చేసింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజయవాడలోని రామానాయుడు స్టూడియో నిర్మాణాన్ని చేపట్టడం కోసం 34.44 ఎకరాల భూమిని కేటాయించారు.

ఈ ప్రభుత్వ స్థలంలో రామానాయుడు స్టూడియోని నిర్మించడమే కాకుండా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూడా దోహదపడుతుందన్న ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఈ స్థలం కేటాయించారు. అయితే ఇందులో కొంత భాగం మాత్రమే రామానాయుడు స్టూడియో కోసం వినియోగించుకున్నారు. దాదాపు 15 ఎకరాల భూమిని ఫ్లాట్లు వేసి అపార్ట్మెంటులో కట్టబోతున్నారు.

ఇందుకు గాను గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం సైతం ఆ భూమిని వెనక్కి తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వ భూమిని సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో ఈ విషయంపై టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

ఇచ్చిన ప్రయోజనం కోసం కాకుండా ఇతర పనులకు ఉపయోగిస్తే ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలి అంటూ కోర్టు నుంచి కూడా తీర్పు రావడంతో ఈ ప్రభుత్వం కూడా ఆ భూమిని వెనక్కి తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే రెవిన్యూశాఖ ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా.. రామానాయుడు స్టూడియో యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని విశాఖ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.