బలమైన నేతల కోసం గేట్లు తెరిచేసిన బిజెపి

ఇతర పార్టీల నుండి నేతలను చేర్చుకునే విషయంలో బిజెపి గేట్లు బార్లా తెరిచేసింది. మొన్నటి వరకూ ఇతర పార్టీల నుండి నేతలను చేర్చుకునే విషయంలో బిజెపి నేతలు కాస్త గుంభనంగా వ్యవహరించేవారు. తాజాగా బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు మాటలు విన్న తర్వాత బార్లా గేట్లు తెరిచేసిందని అర్దమవుతోంది.

జీవిఎల్ మీడియాతో మాట్లాడుతూ ఏ పార్టీ నుండి నేతలు వచ్చిన బిజెపిలో చేర్చుకుంటామని ప్రకటించేశారు. అంటే ఇతర పార్టీల నుండి నేతలను ఆకర్షిస్తే కానీ రాష్ట్రంలో బిజెపి బలపడదన్న విషయం అర్ధమైపోయింది కమలనాధులకు. ఇదంతా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటంలో పార్టీని బలోపేతం చేయటంలో భాగమే అనుకోవాలి.

మొన్నటి ఎన్నికల్లో బిజెపి తరపున 175 అసెంబ్లీలకు పోటీ చేశారు అభ్యర్ధులు. అయితే కనీసం ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలో కూడా డిపాజిట్ రాలేదన్న విషయం గమనార్హం. బహుశా వచ్చే ఎన్నికల్లో కూడా ఇంతకన్నా భిన్నంగా ఫలితాలు ఉండే అవకాశం లేదు.

ఆ విషయాన్ని కేంద్ర నాయకత్వం కూడా గ్రహించింది. అందుకనే ఇతర పార్టీల్లోని గట్టి నేతలపై కన్నేసింది. అందులో భాగంగానే ముందుగా టిడిపి నేతలతో టచ్ లోకి వెళ్ళింది. కొంతమంది నేతలతో బిజెపినే టచ్ లోకి వెళితే మరికొంతమంది టిడిపి నేతలు వాళ్ళంతట వాళ్ళే బిజెపి అధిష్టానంతో టచ్ లోకి వెళ్ళారు.  

టిడిపికి భవిష్యత్తు లేదన్న అనుమానంతోనే ఎక్కువమంది టిడిపి నేతలు బిజెపిలో చేరటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందుకే జివిఎల్ కూడా ధైర్యంగా ఏ పార్టీ నుండి నేతలు వచ్చినా చేర్చుకుంటామని చెబుతున్నది.