కూటమిపై తాటికాయ… కాపు ఐక్య వేదిక సంచలన వ్యాఖ్యలు!

రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కంకణం కట్టుకున్న టీడీపీ అధినేత… కాపుల ఓట్లు తమకు గంపగుత్తగా పడితే అది సాధ్యమవుతుందని భావించారని చెబుతుంటారు. దీంతో.. కాపుల ఓట్లే లక్ష్యంగా జనసేనతో పొత్తు పెట్టుకున్నారనేది బహిరంగ రహస్యమే అనేది చాలా మంది చెప్పే మాట. ఈ సమయంలో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే కారణంతో బీజేపీనీ కలుపుకుని బయలుదేరారు. ఈ నేపథ్యంలో… ప్రత్యక్షంగా బీజేపీకి పరోక్షంగా కూటమికి షాకిచింది కాపు ఐక్య వేదిక!

అవును… రానున్న ఎన్నికల్లో కూటమికి ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, క్రీస్టియన్, ముస్లిం లతో పాటు బీసీలూ, కాపులు కూడా భారీ షాకిచ్చేలా పరిస్థితులు మారుతున్నాయని అంటున్నారు. దీనికి కారణం పురందేశ్వరి నాయకత్వంలోని ఏపీ బీజేపీలో కాపు సామాజికవర్గానికి చెందిన ఒక్కరంటే ఒక్కరికి కూడా టిక్కెట్ ఇవ్వకపోగా.. పవన్ కల్యాణ్ సారధ్యంలోని జనసేనలో బీసీలను, మైనారిటీలనూ పక్కన పెట్టారు!

మరోపక్క చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీలో అత్యధికంగా కమ్మ సామాజికవర్గానికే టిక్కెట్లు కట్టబెట్టారని.. అక్కడ కూడా కాపులకు దామాషా పద్దతిలో న్యాయం జరగలేదని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఏ సామాజికవర్గం ఓట్లు లక్ష్యంగా మూడు పార్టీలూ కూటమిగా ఏర్పడ్డాయో… ఇప్పుడు ఆ సామాజికవర్గమే కూటమిపై నిప్పులు చెరుగుతుండటంతో ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది.

కూటమిలో భాగంగా… బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాలు దక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముందుగా 6 లోక్ సభ స్థానాలకు, అనంతరం 10 అసెంబ్లీ స్థానలకూ బీజేపీ అధిష్టాణం అభ్యర్థులను ప్రకటించింది. అయితే… ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో 16 స్థానాల్లోనూ ఒక్కరికి కూడా కాపులకు సీటు కేటాయించలేదు. కాపు ఉపకులాలను కూడా బీజేపీ పూర్తిగా విస్మరించింది.

దీంతో… కాపు ఐక్యవేదిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది! ఇదే సమయంలో… రాష్ట్రంలో తమను పూర్తిగా విస్మరించిన బీజేపీకి & కో కి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పితీరుతామని తెలిపింది! ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది! టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కలిసి కాపులకు కావాలనే అన్యాయం చేశారంటూ కాపు ఐక్య వేదిక మండిపడుతోంది!

దీంతో ఆ 10 అసెంబ్లీ 6 లోక్ సభ స్థానాల్లో బీజేపీ నేతలకు కాపుల సెగ గట్టిగా తగిలేలా ఉందని అంటున్నారు. ఇప్పటికే ఎస్సీ, క్రీస్టియన్, ముస్లింల ఓట్లు బీజేపీకి పడే అవకాశం లేదని, కూటమిని వారంతా దురం పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్న నేపథ్యంలో… బీజేపీపై తాజాగా కాపులు ఇలా ఫైర్ అవ్వడం ఆసక్తిగా మారింది. ఇది కూటమికి అతిపెద్ద సమస్యగా మారే అవకాశాలున్నాయని చెబుతుంది.

మరోపక్క… పవన్ ప్రకటించిన 18 మంది అభ్యర్థుల్లో కేవలం ఇద్దరంటే ఇద్దరే బీసీలకు జనసేన టిక్కెట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం 18 సీట్లలో 12 అగ్రవర్ణాలకే కేటాయించారు. ప్రధానంగా… శెట్టి బలిజ, గౌడ, తూర్పు కాపు, బీసీ వెలమ, యాదవ, బోయ, కురుబ, చేనేత కులాలకు ఒక్క సీటు కూడా జనసేనలో దక్కలేదు. ఇక ముస్లిం మైనారిటీల ఊసే లేదు!

దీంతో.. ఇప్పటికే సీట్ల సర్దుబాటులో భాగంగా రెబల్స్ అతిపెద్ద సమస్యగా మారుతున్న దశలో… ఇది మరో అతిపెద్ద సమస్య అని అంటున్నారు పరిశీలకులు. మరి ఇన్ని సమస్యల మధ్య కూటమి ఎలా గట్టేకుతుందనేది వేచి చూడాలి!