వామ్మో… కాకినాడ కూడా త్యాగం చేయాలా ఏమిటి?

పురాణాల్లోనూ, ఇతిహాసాల్లోనూ త్యాగం అంటే ఎవరు గుర్తొస్తారు అనే సంగతి కాసేపు పక్కనపెడితే… గతకొంతకాలంగా త్యాగం అనే మాట వినిపిస్తుంటే చాలు వెంటనే పవన్ కల్యాణ్ పేరు తళుక్కున మెరుస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా పొత్తులో భాగంగా వివిద దశల్లో పవన్ చేసిన త్యాగాలు ఒకవర్గం ప్రజానికానికి విపరీతమైన మంటను తెచ్చాయని చెబుతుంటారు. ఈ విషయంలో కొంతమంది పైకి చెప్పుకోగా.. మరికొంతమంది లోలోపల కుమిలిపోయారని అంటుంటారు.

ఆ సంగతి అలా ఉంటే… పొతులో భాగంగా ఫైనల్ గా 144 అసెంబ్లీ + 17 లోక్ సభ సీట్లు టీడీపీకి.. 21 + 2 సీట్లు జనసేనకు.. 10 + 6 సీట్లు బీజేపీకి అనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎవరి కోటా ప్రకారం వాళ్లు అభ్యర్థులను ఆల్ మోస్ట్ ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు నియోజకవర్గాల్లో “కూటమిలో కుంపటి” అనే ఎపిసోడ్స్ తెరపైకి వస్తున్నాయి. ఇవి కాస్తా కొన్ని చోట్ల బుజ్జగింపులతో పరిష్కారమవుతుంటే.. మరికొన్ని చోట్ల మాత్రం రెబల్స్ గా పోటీ చేసేవరకూ వెళ్తుందని తెలుస్తుంది.

ఆ సంగతి అలా ఉంటే… పొత్తులోకి బీజేపీ ఎంటరవ్వక మందు జనసేన వాటా 24 + 3 గా ఉండేది. అంతక ముందు చాలా నెంబర్సే మీడియాలో హల్ చల్ చేసినా.. 24 + 3 దగ్గరకు వచ్చి ఆగింది. అయితే కూటమి ఎంటరవ్వడంతో పవన్ కల్యాణ్ త్యాగం చేయక తప్పలేదు. ఇందులో భాగంగా… 3 అసెంబ్లీ, 1 లోక్ సభ స్థానాన్ని త్యాగం చేశారు. ఈ త్యాగాల్లో భాగంగానే నాగబాబు కు అనకాపల్లి / నరసాపురం లోక్ సభ, పోతిన మహేష్ కు విజయ్వాడ వెస్ట్ శాసనసభ టిక్కెట్లు పోయాయని చెబుతుంటారు.

ఈ క్రమంలో తాజాగా బీజేపీకి మరో అసెంబ్లీ సీటు కావాలని కోరుకుంటుందని కథనాలొచ్చాయి! ప్రస్తుతం వాటిపైనా చర్చ ఇంకా నడుస్తోందని చెబుతున్నారు! ఆ సంగతి అలా ఉంటే… సుమారు నాలుగున్నర దశాబ్ధాలుగా బీజేపీతో అనుబంధం ఉన్న, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు టిక్కెట్ దక్కలేదు! 10 అసెంబ్లీ స్థానాలకూ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. వారిలో వీర్రాజు పేరు లేదు. అయితే.. అనపర్తిని ఆయనే స్వయంగా వదులుకున్నట్లు చెబుతున్నారు.

ఇలా ఇప్పటికే వలసపక్షులకు ఏపీ బీజేపీలో పెద్దపీట అనే అంశం కార్యకర్తల్లో హాట్ టాపిక్ గా మారడంతో.. వారంతా అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారని కథనాలొస్తున్న నేపథ్యంలో… సోము వీర్రాజుని కూడా అకామిడేట్ చేయకపోతే అది కాస్తా మరింత అధ్వాన్నంగా మారిపోతుందేమో అనే ఆందోళన బీజేపీ పెద్దల్లో మొదలైందని అంటున్నారు. దీంతో… మరోసారి పవన్ కి త్యాగం చేసే అవకాశాన్ని ఇవ్వబోతున్నారనే ఊహాగాణం గోదావరి జిల్లాలో తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా… ఏపీ బీజేపీ మాజీ చీఫ్ సోము వీర్రాజుకి ఎంపీ టిక్కెట్ ఇచ్చే అవకాశాలను పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నారనే ఒక ఊహాగాణం ఇప్పుడు ప్రధానంగా గోదావరి జిల్లాల్లో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా… కాకినాడ ఎంపీ స్థానాన్ని పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు పవన్ ను సంప్రదించడానికి బీజేపీ పెద్దలు ప్రయత్నించే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో… ఈ విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోందని తెలుస్తుంది!

కాగా.. ఇటివల తాను పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి, కాకినాడ లోక్ సభ స్థానం నుంచి ఉదయ్ పోటీ చేస్తారని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో… అమిత్ ష ఆదేశిస్తే… తాను కాకినాడ ఎంపీగా పోటీచేసే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో… అదే అమిత్ షా కోరితే కాకినాడ లోక్ సభ టిక్కెట్ కూడా సోము వీర్రాజు కోసం త్యాగం చేయక తప్పదేమో అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. కాస్త వేచి చూస్తే… పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉంది!