ఉత్తరాది బిజెపికి ఆంధ్రా పార్టీ దెబ్బ మామూలుగా లేదుగా

టిడిపి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంతో ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి. ఎవరికి వారు అవిశ్వాసాన్ని నెగ్గెందుకు పావులు కదుపుతున్నారు. ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఎత్తుగడల్లో మునిగిపోయారు. ఏపికి ప్రత్యేకహోదా, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బిజెపి ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అది శుక్రవారం చర్చకు రానుంది. దీంతో పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఎంపీలకు విప్  జారీ చేశాయి.

టిడిపి అధినేత, ఏపి సీఎం చంద్రబాబునాయుడు అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ అన్ని పార్టీల నేతలకు లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని, 18 అంశాల్లో కేంద్రానికి అన్యాయం జరిగిందని బాబు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే టిడిపి ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిపై ఏడు గంటల పాటు చర్చ జరిగే అవకాశం ఉంది కాబట్టి  5 కోట్ల ఆంధ్రుల గొంతుక వినిపించాలని ఎంపీలకు సూచించారు. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని టిడిపి ఎంపీలు అన్ని పార్టీల అధినేతలను, ఎంపీలను సమావేశాలకు ముందుగానే కలిశారు. దీంతో అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టడం సులువైంది. దీంతో  స్పీకర్ కూడా వెంటనే అవిశ్వాస తీర్మానాని అనుమతించారు. ముందుగా పది రోజుల్లో చెబుతామని చెప్పినప్పటికి ఏమైందో ఏమో శుక్రవారమే దీనిపై చర్చిస్తామని స్పీకర్ ప్రకటించారు. దీంతో రాజకీయం మరింత హీటెక్కింది. తక్కువ సమయం ఉండటం, బిజెపికి ఉన్న సంఖ్యరీత్యా అవిశ్వాసం  వీగే అవకాశం ఉండటంతో ప్రతిపక్షాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.

డిఎంకే నేత స్టాలిన్ అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నామని  ప్రకటించగా, తమిళ సీఎం పళని స్వామి తాము మద్దతు ఇవ్వబోమని చెప్పారు. కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ తమ ఎంపీలతో ఇప్పటికే పార్లమెంటరీ సమావేశాన్ని నిర్వహించారు. వైసిపి నేతలు పార్లమెంటు ఆవరణలో నిరసన  తెలుపుతున్నారు. పార్లమెంటులో మొత్తం సభ్యులు 545 కాగా అందులో అవిశ్వాసం నెగ్గాలంటే మ్యాజిక్ ఫిగర్ 272. వైసిపి సభ్యుల రాజీనామాలతో ప్రస్తుతం 535 మంది సభ్యులు ఉన్నారు. దీంతో ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి 314 మంది సభ్యులు ఉన్నారు. విపక్షంలో 151మంది, తటస్థులు 70 మందిగా ఉన్నారు. ప్రభుత్వానికి ఢోకా లేదని తెలిసినా అవిశ్వాసాన్ని అదునుగా చేసుకుని బిజెపి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని ప్రతిపక్షాలన్ని ప్రయత్నిస్తున్నాయి.