బంగాళాఖాతంలో మరోసారి ప్రకృతి ప్రళయం భయపెడుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ వాయుగుండంగా మారింది. ఈ వ్యవస్థ రాబోయే 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారబోతోందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. “మొంథా” అని నామకరణం చేసిన ఈ తుపాను సోమవారం లేదా మంగళవారం మధ్యాహ్నం మచిలీపట్నం–కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా.
తీరం దాటే సమయానికి గాలుల వేగం గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. గాలులతో పాటు వర్షాల ప్రభావం రాష్ట్రం అంతటా విస్తరించనుంది. ఇప్పటికే సముద్రం ఉద్ధృతంగా మారుతుండడంతో తీరప్రాంత ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.
తుఫాను దృష్ట్యా వాతావరణ శాఖ రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. వాటిలో పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించింది.
అదనంగా 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, గుంటూరు, ఎన్టీఆర్, తూర్పు గోదావరి, విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ఇక శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కూడా భారీ వర్షాల అవకాశం ఉందని IMD పేర్కొంది.
ప్రస్తుతం వాయుగుండం బలపడుతూ పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. తుఫాన్ తీరం దాటే సమయంలో సముద్రంలో అలలు 3–5 మీటర్ల ఎత్తులో ఎగసే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్ర యాత్రలకు వెళ్లరాదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. తీరప్రాంత గ్రామాల్లో అధికారులు తాత్కాలిక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలతో పాటు అత్యవసర సిబ్బందిని కూడా సిద్ధం చేశారు.
తుఫాన్ ప్రభావం రేపటి రాత్రి నుంచే స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే మూడు రోజులపాటు భారీ వర్షాలు, ఈదురు గాలులు కొనసాగుతాయని అంచనా. తీరప్రాంతాలైన కాకినాడ, బాపట్ల, మచిలీపట్నం, కోనసీమ, విశాఖపట్నం ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం, చెట్లు కూలడం, తక్కువ భూభాగాల్లో నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు ఎదురుకావచ్చని అధికారులు హెచ్చరించారు.
మరోవైపు తుఫాన్ ప్రభావం నేపథ్యంలో మూడు రోజులపాటు అన్ని కార్గో ఎగుమతి–దిగుమతులను నిలిపివేయాలని నిర్ణయించారు. తీరప్రాంత రహదారులపై ట్రాఫిక్ పరిమితులు అమలులోకి తీసుకురావాలని, రైల్వే శాఖ కూడా తాత్కాలిక మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ, రెవెన్యూ, విద్యుత్, పోలీస్ శాఖలు సజాగ్రత్తగా ఉండేలా సూచనలు అందాయి. ప్రజలు ఎలాంటి అప్రమత్తత కోల్పోవద్దని, తుఫాన్ కదలికలపై అధికార ప్రకటనలను మాత్రమే నమ్మాలని ప్రభుత్వ అధికారులు విజ్ఞప్తి చేశారు.
