ఇది చరిత్ర చెబుతున్న విషయం. సిబిఐ విచారణకు నో చెప్పిన ముఖ్యమంత్రులు తర్వాత జైలుకెళ్ళిన ఘటనలు దేశంలో ఎన్నో ఉన్నాయి. అంటే ముందు ఇష్టం వచ్చినట్లు అవినీతికి పాల్పడటం, తర్వాత తమ మీద సిబిఐ విచారణ జరుగుతుందన్న అనుమానంతోనో లేకపోతే సిబిఐ విచారణకు సిద్ధపడితేనో దానిని అడ్డుకోవటం మన దేశంలో మామూలే. చంద్రబాబునాయుడుకన్నా ముందు ఐదుగురు సిఎంలు సిబిఐ విచారణను అడ్డుకున్నారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి అదే సిబిఐ విచారణలో తగులుకుని చివరకు జైలు పాలయ్యారు. అంటే కన్సెంట్ రద్దు చేసిన వాళ్ళంతా తర్వాత ఓడిపోవటం, జైలుకెళ్ళటమన్నది ఓ సెంటిమెంటుగా మారిపోయిందా ?
ఇక ప్రస్తుత విషయానికి వస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో తెలీదు కానీ సిబిఐ ప్రవేశాన్ని అడ్డుకుంటూ జోవో జారీ చేశారు. సరే ఆ జీవో చెల్లుతుందా అంటే నాలుక గీసుకోవటానికి కూడా పనికిరాదు. నాలుగున్నరేళ్ళ చంద్రబాబు పాలనలో అవినీతి ఆరోపణలు విపరీతంగా పెరిగిపోయాయి. రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్, సుజనా చౌదరితో పాటు అనేక మంది మంత్రులు, ఎంఎల్ఏలు అడ్డుగోలు సంపదానలో ముణిగిపోయారు. రమేష్, సుజనా పై ఐటి, ఈడి దాడులు జరిగేటప్పటికి చంద్రబాబు గగ్గోలు పెట్టటం మొదలుపెట్టారు.
అవినీతిపై ఎక్కడ కేంద్ర దర్యాప్తు సంస్ధల విచారణ జరుగుతుందో అని చంద్రబాబే చాలా కాలంగా భయపడుతున్నారు. ఆ విషయాన్ని పక్కన పెడితే విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్న జరిగిన విషయం తెలిసిందే. హత్యాయత్నం ఘటన జరగ్గానే అదంతా జగనే చేయించుకున్న దాడిగా వర్ణించారు. దాంతో ఒక్కసారిగా వివాదం పెరిగిపోయింది. అందుకే తనపై జరిగిన హత్యాయత్నం ఘటనను థర్డ్ పార్టీతో విచారణ చేయించాలంటూ జగన్ హై కోర్టులో కేసు వేశారు. ఆ కేసు విచారణలో ఉంది.
కోర్టు విచారణలో ప్రభుత్వ తరపు వాదనలు వినిపిస్తున్న అడ్వకేట్ జనరల్ వాదన తేలిపోతోంది. అందుకనే జగన్ కేసు విషయంలో సమాధానం ఇవ్వాలంటూ కోర్టు చంద్రబాబుకు రెండు వారాల గడువు ఇఛ్చింది. దాంతో చంద్రబాబులో టెన్షన్ మొదలైంది. హత్యాయత్నం ఘటనలో హై కోర్టు సిబిఐ విచారణకు ఎక్కడ ఆదేశిస్తుందో అన్న అనుమానంతోనే సిబిఐ ప్రవేశాన్ని అడ్డుకుంటూ జీవో తెచ్చారు. కోర్టు గనుక సిబిఐ విచారణకు ఆదేశిస్తే జీవో చెల్లదన్న విషయం చంద్రబాబుకు కూడా తెలిసే ఉంటుంది.
ఒకసారి చరిత్రను చూద్దాం. హిమాచల్ ప్రదేశ్ సిఎంగా ఉన్న రోజుల్లో వీరభద్రసింగ్ పై అవినీతి ఆరోపణలు ముసురుకున్నాయి. ఏసిబి విచారణలో ముద్దాయిగా కూడా నిలబడ్డారు. చివరకు విచారణ సిబిఐ దాకా వెళ్ళింది. అయితే సిబిఐ విచారణను సిఎం అడ్డుకుంటు జీవో తెచ్చారు. అయితే కోర్టు జోక్యం చేసుకుని జీవోను కొట్టేసింది. తర్వాత పరిణామాల్లో దంపతులిద్దరూ జైలుకెళ్ళారు.
తర్వాత జార్ఖండ్ సిఎం మధుకోడాది అదే దారి. స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచి అదృష్టంతో సిఎం అయిపోయారు. తర్వాత అవినీతిలో కూరుకుపోయారు. ఆరోపణలు రాగానే ముందుగా సిబిఐ ఎంట్రీని అడ్డుకుంటూ ఉత్తర్వులిచ్చారు. అయితే, కోడా ఉత్తర్వులను ఢిల్లీ కోర్టు కొట్టేసింది. దాంతో సిబిఐ రంగప్రవేశం చేసింది. సిఎం హోదాలోనే కోడాను అదుపులోకి తీసుకుని జైలుకు పంపింది.
ఇక లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి కేసు అందిరికీ తెలిసిందే. తనపై సిబిఐ విచారణ తప్పదని అర్ధమైపోయింది. దానికి తగ్గట్లే సిబిఐ కోర్టు కూడా సిబిఐ విచారణకు ఆదేశించింది. అయినా లాలూ సిబిఐ విచారణకు నో చెప్పారు. దాంతో సుప్రింకోర్టు లాలూ దుమ్ము దులిపేసిం. దాంతో సిబిఐ విచారణ మొదలుపెట్టి లాలూను అరెస్టు చేసి జైలుకు పంపింది.
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పది కూడా అదే దారి. గాలి జనార్ధన రెడ్డి అవినితిని వెనకేసుకొచ్చాడు. లోక్ అదాలత్ విచారణ తర్వాత సిబిఐ విచారణను అడ్డుకున్నారు. కానీ హై కోర్టు ఉత్తర్వులను కొట్టేసింది. వెంటనే సిబిఐ రంగ ప్రవేశం చేసి యడ్యూరప్పను అదుపులోకి తసుకుని తర్వాత జైలుకు పంపింది. చరిత్రను గమనిస్తే తేలేదేమంటే సిబిఐకి కన్సెంట్ అడ్డుకున్న వారంతా తర్వాత ఎన్నికల్లో ఓడిపోయి జైలుకెళ్ళారు. మరి ఏపిలో ఏం జరుగుతుందో చూడాలి.