సిబిఐ విచారణ పై చంద్రబాబుకు హైకోర్టు షాక్

తన అనుమతి లేకుండా సిబిఐ రాష్ట్రంలోకి వచ్చేందుకు లేదని చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు పూచికపుల్లలాగ తీసిపడేసింది. దాదాపు దశాబ్ద కాలం క్రితం జరిగిన ఆయేషా మీరా హత్యకేసు విచారణను సిబిఐకి అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర సంస్ధల దర్యాప్తుకు భయపడి చంద్రబాబు ఈమధ్యే సిబిఐ విచారణకు నో ఎంట్రి అంటూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఉత్తర్వులు ఇచ్చిందేమో జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన నేపధ్యంలో.

 

చంద్రబాబు ఒకటి ఆలోచిస్తే హై కోర్టు ఇంకో రూపంలో స్పందించింది. టిడిపి నేతలపై జరుగుతున్న ఐటి, ఈడి దాడులను అడ్డుకోవటం, జగన్ పై హత్యాయత్నం కేసును నీరగార్చే ఉద్దేశ్యంతో చంద్రబాబు సిబిఐ విచారణకు నో చెప్పారు. సరే హైకోర్టు గనుక ఆదేశిస్తే సిబిఐ విచారణకు దిగవచ్చని అప్పట్లోనే న్యాయ నిపుణులు చెప్పారనుకోండి అది వేరే సంగతి. కాకపోతే అందరూ హత్యాయత్నం కేసు విషయంపైనే హైకోర్టు ఏ విధంగా స్పందింస్తుందో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

 

అయితే ఎవరూ ఊహించని రీతిలో 2007లో జరిగిన నర్సింగ్ విద్యార్ధిని ఆయేషామీర హత్యకేసు విచారణ చేయమని కోర్టు సిబిఐని ఆదేశించింది. హైకోర్టు ఆదేశించింది కాబట్టి ఆయేషామీరా కేసును సిబిఐకి అప్పగించక తప్పదు రాష్ట్రప్రభుత్వానికి. కోర్టు ఆదేశాల తర్వాత కూడా సిబిఐ విచారణకు నో చెప్పేందుకు లేదు చంద్రబాబుకు. అంటే రేపటి రోజున జగన్ పై హత్యాయత్నానికి సంబంధించిన కేసులో కూడా కోర్టు అనుకుంటే సిబిఐ విచారణకు ఆదేశిస్తే చంద్రబాబు చేయగలిగేది లేదు.