టిడిపి నేత అక్రమ మైనింగ్ పై సిబిఐ విచారణ

వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి మాజీ ఎంఎల్ఏ అక్రమ మైనింగ్ కేసును సిబిఐకి అప్పగిస్తు క్యాబినెట్ సమావేశం తీర్మానించింది. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే సిబిఐ విచారణపై సుదీర్ఘ చర్చ జరిగింది. టిడిపి మాజీ ఎంఎల్ఏ యరపతినేని అక్రమ మైనింగ్ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది.

అవసరమని అనుకుంటే రాష్ట్రప్రభుత్వం ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. ఎందుకంటే తన విచారణలోనే మాజీ ఎంఎల్ఏ అక్రమ మైనింగ్ కు పాల్పడినట్లు కోర్టే దాదపు తేల్చేసింది. అక్రమ మైనింగ్ ను ఆపటంలో ప్రభుత్వం విఫలమైనట్లు కోర్టు అక్షింతలు కూడా వేసింది.

చంద్రబాబునాయుడు హయంలో అక్రమ మైనింగ్ పై  జరిగిన సిఐడి విచారణలో లోపాలున్నట్లు మండిపడింది. అదే సమయంలో అక్రమ మైనింగ్ జరిగిందని నిర్ధారణ అయినా ఇందులో ఎవరెవరి పాత్ర ఉందన్న విషయం మాత్రం సస్పెన్స్ గానే ఉండిపోయింది. అందుకనే కోర్టు కూడా సిబిఐ విచారణను రాష్ట్రప్రభుత్వ నిర్ణయానికి వదిలేసింది.

కోర్టు వ్యాఖ్యల ఆధారంగా క్యాబినెట్ సమావేశం యరపతినేని అక్రమ మైనింగ్ పై సిబిఐతో విచారణ జరిపించాలని డిసైడ్ అయ్యింది. నిజంగానే సిబిఐ గట్టిగా విచారణ చేస్తే అక్రమ మైనింగ్ వెనుక ఉన్న వాళ్ళ పాత్రమొత్తం బయటపడుతుంది. అలాగే అక్రమ సంపాదనలో ఎవరి సంపాదన ఎంతన్న విషయం కూడా లోకానికి తెలుస్తుంది.