చంద్రబాబు బండారం బయటపడుతుందా ?

40 యేళ్ళ అనుభవం నేర్పని పాఠాలు

యరపతినేని శ్రీనివాస్ అక్రమ మైనింగ్ కేసు విచారణలో అయినా చంద్రబాబునాయుడు బండారం బయటపడుతుందా ? ఇపుడిదే అనుమానం అందరిలోను మొదలైంది. గుంటూరు జిల్లాలోని గురజాల నియోజకవర్గంలో ఐదేళ్ళ పాటు జరిగిన అక్రమ మైనింగ్ లో తెరమీద అందరికీ కనిపించింది యరపతినేని శ్రీనివాసే అయినప్పటికి తెర వెనుక వ్యక్తులు మాత్రం వేరు.

యరపతినేని అక్రమ మైనింగ్ మొత్తం ప్రభుత్వానికి తెలిసే జరిగింది. కొంతభూమిని లీజుకు తీసుకుని వందల ఎకరాలను అక్రమ మైనింగ్ కు ఉపయోగించుకున్నట్లు ఆధారాలతో సహా బయటపడింది. అక్రమ మైనింగ్ ను అరికట్టి, చర్యలు తీసుకోవాల్సిన రెవిన్యు, మైనింగ్, పోలీసు శాఖలు తమకేమీ పట్టనట్లుండిపోయాయి. మొదట్లో మైనింగ్ శాఖ నోటీసిచ్చినా తర్వాత ఏమైందో ఏమో మళ్ళీ అటువైపు కనీసం తొంగి కూడా చూడలేదు.

అప్పటి నుండి యరపతినేని ఆకాశమే హద్దుగా అక్రమాలతో చెలరేగిపోయారు. ఈయన అక్రమ మైనింగ్ పై అప్పట్లో వైసిపి నేతలు చాలా ఆరోపణలే చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. సరే హై కోర్టులో కేసు వేయటం, విచారణ జరగటం అందరికీ తెలిసిందే. విచారణలో యరపతినేని అక్రమ మైనింగ్ వివరాలు చూసి హై కోర్టే ఆశ్చర్యపోయింది. హై కోర్టు విచారణలో సుమారు రూ. 400 కోట్ల మేర అక్రమ మైనింగ్ జరిగినట్లు బయటపడింది.

ఈ నేపధ్యంలోనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే కోర్టు విచారణ స్పీడందుకుంది. అదే సమయంలో ప్రభుత్వం అక్రమ మైనింగ్ పై సిబిఐ విచారణ కోరవచ్చంటూ సూచించింది. దాంతో ప్రభుత్వం యరపతినేని అక్రమ మైనింగ్ పై సిబిఐ విచారణ కోరుతు కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం నుండి సానుకూలత రాగానే తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో అక్రమ మైనింగ్ వెనకున్న వ్యక్తులెవరో తేలిపోతుంది.