శానస మండలిని రద్దు చేస్తూ శాసన సభ తీర్మానించడం రాజ్యాంగబద్దమే. అయినా ఆ తీర్మానం పార్లమెంటు ఆమోదించి రాష్ట్ర పతి నోటిఫై చేసేంత వరకు అది ఉనికిలో వుంటుంది. చట్టబద్దత కలిగి వుంటుంది. శాసన సభ తో సమాన హక్కులు కలిగి వుంటుంది. శాసన సభ స్పీకర్ కు గలిగిన హక్కులు మండలి చైర్మన్ కలిగి వుంటారు. మండలి చైర్మన్ ఇచ్చే రూలింగ్ లను కోర్టులు కూడా ప్రశ్నించలేవు. అధికారులు అమలు చేయవలసినదే.
శానస సభ ఆమోదించి పంపిన సిఆర్డిఎ మరియు వికేంద్రీకణ బిల్లులను చైర్మన్ తన విచక్షణాధికారం ఉపయోగించి సెలక్ట్ కమిటీకి పంపడం తెలిసిన విషయమే. అప్పటి నుండే వైసిపి టిడిపి నేతల మధ్య వాద వివాదాలు మొదలైనవి. ఈ పోరులో శాసన మండలి కార్యదర్శికి ముందు నుయ్యి వెనుక గొయ్యిగా తయారైంది. శాసన సభ కార్యదర్శే మండలి కార్యదర్శిగా వున్నారు. మండలి చైర్మన్ సెలక్ట్ కమిటీ నియామకానికి ఆదేశాలు జారీ చేస్తే ఆ సెక్షన్ కింద చెల్లుబాటు కాదని కార్యదర్శి చైర్మన్ కు ఫైల్ తిప్పి పంపారు. వైసిపి అధికారంలో వుంది కాబట్టి కార్యదర్శి వారి మాట వినక తప్ప లేదు.
మండలి కార్యదర్శి తన ఆదేశాలను పాటించనందుకు చైర్మన్ ఆగ్రహంగా వున్నారని చెబుతున్నారు. పైగా ఈ రోజు సరికొత్త మలుపు తిరిగింది. మండలి చైర్మన్ తిరిగి ఫైల్ మండలి కార్యదర్శికి పంపి సెలక్ట్ కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారని చెబుతున్నారు. ఈ దఫా కార్యదర్శి ఏం చేస్తారో మిలియన్ డాలర్ల ప్రశ్నగా వుంది.మరో వేపు రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభలను ప్రొరోగ్ చేసింది. ఈ సందర్భంగా శాసన మండలిలో పెండింగ్ లో వున్న బిల్లులు ఆమోదినికి ఆర్డినెన్స్ తెస్తారని చెబుతున్నారు. ఇందుకు అడ్డంకులు వుండవని చెబుతున్నారు.
శాసన మండలిలో సెలక్ట్ కమిటీ 14 రోజుల్లో ఏర్పాటు చేయ లేదు కాబట్టి బిల్లులు ఆమోదం పొందినట్లేనని మంత్రులు ఇదివరలో ప్రకటించడం విదితమే. అంతేకాకుండా డివిజన్ కోర కుండా సెలక్ట్ కమిటీకి పంపడం నిబంధనలకు విరుద్ధమని మంత్రలు వాదించి వున్నారు. ఈ లోపు మండలి చైర్మన్ ఆదేశాలను కార్యదర్శి అమలు చేయకపోతే సభా ధిక్కారం కింద చర్యలు తీసుకోవాలని టిడిపికి చెందిన ఎమ్మెల్సీలు పథక రచన చేస్తున్నారు. శాసన సభ మండలి రద్దు చేస్తూ చేసిన తీర్మానం కేంద్రం కొంత కాలమైనా నానబెడుతుందా? లేక వెను వెంటనే చర్యలు తీసుకుంటుందా? ఈ అన్ని అంశాలపై ఈ కథ ఆధార పడి వుంది. అందుకే ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలుసుకొనేందుకు తిరిగి ముఖ్యమంత్రి ఢిల్లీ పయనం పెట్టుకున్నారు.