తెలుగు అమ్మాయిలపై, ‘బాహుబలి’ పై రజనీ అదిరిపోయే కామెంట్

సూపర్‌స్టార్‌ రజనీకాంత్, బాలీవుడ్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌లు కలిసి నటిస్తున్న చిత్రం ‘2.0’.ఈ చిత్రం రిలీజ్ కు సిద్దపడుతున్న నేపథ్యంలో ఆశ్చర్యకరమైన విషయాలు ఒక్కోటి బయటికొస్తున్నాయి. సైన్స్ ఫిక్షన్ సబ్జెక్టుతో శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమానవంబరు 29న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమౌతోంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్‌ నేపథ్యంలో ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో రికార్డ్ లు క్రియేట్ చేయటం ఖాయమనేది ఖాయమైపోయింది. ఈ చిత్రం నవంబరు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడింది. ఈ సందర్బంగా రజనీ..ఈ సినిమాకు అసలు పబ్లిసిటీ చేయనక్కర్లేదని అని అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే బాహుబలి గురించి, తెలుగు వారి గురించి కూడా ప్రస్దావించారు. 

రజనీకాంత్‌ మాట్లాడుతూ.. ‘‘తెలుగువారు చాలా మంచివారు. తెలుగు భోజనం లోక ప్రసిద్ధి. తెలుగు అమ్మాయిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘రోబో’ సినిమా సమయంలో శంకర్‌ ఒక సన్నివేశాన్ని టూడీ నుంచి త్రీడీలోకి మార్చి చూశారు. చాలా బాగా అనిపించింది. ‘ఒక మంచి సబ్జెక్ట్‌ దొరికితే నేరుగా త్రీడీలో తీస్తా’ అని ఆ సమయంలో నాతో అన్నారు. నాలుగైదేళ్ల క్రితం ఈ సబ్జెక్ట్‌ చెప్పారు. ఇది సాధ్యమవుతుందా? అన్న ప్రశ్నే నాకు తలెత్తలేదు. ఎందుకంటే ఆయన ఏదైనా చేస్తారు.

 

‘బాహుబలి’ విజయానికి ప్రధాన కారణం సబ్జెక్ట్‌. ఈ సినిమా కూడా టెక్నాలజీతో కూడిన మంచి సబ్జెక్ట్‌. దీనికి పబ్లిసిటీ అక్కర్లేదు. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులే ప్రచారం చేస్తారు. నా తొలి చిత్రం ‘అపూర్వ రారంగల్‌’ తర్వాత మళ్లీ ఒక సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తానా? అన్న ఆత్రుత ‘2.ఓ’కు కలుగుతోంది.

ఎందుకంటే దాదాపు 70శాతం వీఎఫ్‌క్స్‌ సన్నివేశాలు ఉంటాయి. ఎక్కడ ఏ సన్నివేశం వస్తుందో నాకూ తెలియదు. భారత చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ సినిమా. అందుకు శంకర్‌ బృందం, అక్షయ్‌కుమార్‌ పడిన కష్టం మీకు తెరపై కనపడుతుంది. మీలాగానే నేను కూడా సినిమా కోసం ఎదురు చూస్తున్నాం.’’ అని అన్నారు.