Shankar: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో శంకర్ అనే పేరు ఒకప్పుడు ఒక బ్రాండ్‌గానే ఉండేది. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు భారీ బడ్జెట్, అద్భుతమైన కంటెంట్‌తో ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించేవి. కానీ గత కొన్నేళ్లుగా శంకర్ చిత్రాలకు పెద్దగా ఆదరణ లేకుండా పోయింది. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రూపొందిన సినిమాలు భారీతనానికి పరిమితమవుతున్నాయి తప్ప, ప్రేక్షకుల మనసు దోచుకునే కంటెంట్ అందించడంలో వెనుకబడి పోతున్నాయి.
‘గేమ్ చేంజర్’ వంటి సినిమాలకు కేవలం పాటల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగినా, ఆ డబ్బు వృథా అయ్యిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాటల కోసం ఖర్చు చేసిన 70 కోట్ల బడ్జెట్‌ను ఒక మంచి కథతో తెరకెక్కించబడితే చిత్రానికి మరింత విలువ ఉండేదని ప్రేక్షకులు అంటున్నారు. ఇదే పరిస్థితి శంకర్ గత చిత్రాలైన ‘ఐ’, ‘ఇండియన్ 2’ వంటి సినిమాల విషయంలో కూడా ఎదురైంది.
నిర్మాతలు శంకర్ మీద పెట్టిన నమ్మకంతో భారీగా బడ్జెట్ కేటాయించినా, ఆఖరికి ఆ పెట్టుబడికి తగిన ఫలితాలు రాకపోవడంతో తాము నష్టపోయామని భావిస్తున్నారు. ‘గేమ్ చేంజర్’లో ఎదురైన అనుభవం దిల్ రాజు వంటి ప్రముఖ నిర్మాతలకే గట్టి పాఠం అయ్యిందని భావించవచ్చు. ఇకపై శంకర్ సినిమాలకు మితిమీరిన బడ్జెట్ కేటాయించే విషయంలో నిర్మాతలు వెనుకడుగు వేయడం ఖాయం.
ప్రస్తుత పరిస్థితులనుసరించి, శంకర్ తన దృష్టిని కేవలం భారీతనంపై కాకుండా కంటెంట్‌పై కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ప్రేక్షకులు ఇప్పుడు కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక మంచి కథతో, కొత్తగా ప్రయోగం చేసే సన్నివేశాలతో సినిమాను రూపొందించాల్సిన అవసరం ఉంది. శంకర్ మళ్లీ తన సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పించాలంటే, బడ్జెట్‌ను పర్ఫెక్ట్ గా వినియోగించి, ప్రతి రూపాయికి తగిన విలువ చూపించాలని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. మరి శంకర్ నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ తో వస్తాడో చూడాలి.