వైరల్: అదరహో అన్నగారు.. నభూతో: నభవిష్యతి

నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా నందమూరి బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తూ,నిర్మిస్తున్న చిత్రం ‘యన్‌.టి.ఆర్‌’.ప్రముఖ దర్శకుడు క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. మరో ప్రక్క అంతే వేగంగా సినిమాకు సంభందించిన పాత్రలను పరిచయం చేస్తూ పోస్టర్స్ ని విడుదల చేస్తూ క్రేజ్ క్రియేట్ చేస్తోంది టీమ్.

తాజాగా ఈ చిత్రంలోని ప్రధాన నటీనటుల పాత్రల అందరితో కూడిన ఈ పోస్టర్ ని సోషల్‌మీడియా ద్వారా విడుదల చేసింది. రావాణా బ్రహ్మ గెటప్ లో ఉన్న బాలకృష్ణతో మొదలుకుని.. చిత్రంలో నటిస్తున్న ప్రతీ పాత్రని ఈ ఫొటోలో మనం చూడొచ్చు. ‘అదరహో అన్నగారు.. నభూతో: నభవిష్యతి’ అంటూ ఈ ఫొటోని ఎన్‌బీకే ఫిలిమ్స్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 9న ‘కథానాయకుడు’ పేరుతో విడుదల కానుంది. ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌ ప్రారంభం నుంచి ముఖ్యమంత్రి అయ్యే వరకూ జరిగిన సంఘటనలకు దీనిలో దృశ్యరూపం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక సీఎం అయిన దగ్గరి నుంచి ఆయన మరణించే వరకూ చోటు చేసుకున్న సంఘటనలను ‘మహానాయకుడు’ పేరుతో పిబ్రవరి 7 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఎన్‌బీకే ఫిల్మ్స్‌ పతాకంపై నందమూరి బాలకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వారాహి చలన చిత్రం, విబ్రి మీడియాలు సమర్పిస్తున్నాయి. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.