శబరిమలలో ఘోర ప్రమాదం.. ఏపీకి చెందిన నలుగురు సహా 9మందికి గాయాలు..!

కేరళలోని శబరిమల అయ్యప్ప సన్నిధానం వద్ద శనివారం సాయంత్రం భక్తుల్లో భయాందోళన కలిగించే ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శబరిమల పరిసరాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో చెత్త తరలింపుకు ఉపయోగించే ట్రాక్టర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి జనసమూహంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది భక్తులు గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

శనివారం సాయంత్రం సుమారు ఆరు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అప్పటికి అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చిన భక్తులతో సన్నిధానం ప్రాంతం కిటకిటలాడుతోంది. అదే సమయంలో నిటారుగా ఉన్న రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్ భారీ వర్షం కారణంగా అదుపు తప్పినట్లు పోలీసులు వెల్లడించారు. వేగంగా దూసుకు వచ్చిన ట్రాక్టర్ నేరుగా భక్తుల గుంపులోకి దూసుకెళ్లడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది.

ప్రమాదంలో గాయపడిన వారిలో నలుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించారు. వీరారెడ్డి (30), నితీష్ రెడ్డి (26), దృవంశ్ రెడ్డి (10), సునీత (65), తులసమ్మ (60)తో పాటు తమిళనాడుకు చెందిన ఇద్దరు, కేరళకు చెందిన మరో ముగ్గురు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉండటం ఆందోళనను మరింత పెంచింది.

సమాచారం అందుకున్న వెంటనే సన్నిధానం పోలీసులు, ఆలయ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు కారణమైన ట్రాక్టర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

శబరిమల వంటి అత్యంత రద్దీగా ఉండే పవిత్ర ప్రాంతంలో ఈ తరహా ప్రమాదం జరగడం భక్తుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. భారీ వర్షాల సమయంలో భారీ వాహనాల రాకపోకలపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి.