ప్రస్తుత రోజుల్లో మనిషి జీవితంలో మొబైల్ ఫోన్ ఒక అవసరం కాదు.. అలవాటుగా మారిపోయింది. ఉదయం నిద్రలేచిన క్షణం నుంచి రాత్రి కళ్లు మూసే వరకూ చేతిలో ఉండేది ఫోన్‌నే. కొందరైతే నిద్రపోయేటప్పుడు కూడా దాన్ని దిండు పక్కన పెట్టుకుంటున్నారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి ఎంతవరకు సురక్షితం అన్న ప్రశ్న ఇప్పుడు చాలామందిని ఆలోచింపజేస్తోంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రజల్లో ఆందోళన పెంచుతోంది.
నిపుణుల మాటల్లో చెప్పాలంటే, మొబైల్ ఫోన్ పనిచేసేటప్పుడు విడుదలయ్యే రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలు మన చుట్టూ ఉన్న వైఫై, రేడియో సిగ్నల్స్‌లాంటివే. ఇవి అయోనైజింగ్ రేడియేషన్ కాదని, అంటే DNAను నేరుగా దెబ్బతీసే శక్తి వీటికి లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఎక్స్‌రేలు, అల్ట్రావయొలెట్ కిరణాలతో పోలిస్తే మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావం చాలా తక్కువేనని ఇప్పటివరకు జరిగిన అధ్యయనాలు చెబుతున్నాయి. మొబైల్ వాడకం వల్ల క్యాన్సర్ వస్తుందని నిరూపించే స్పష్టమైన ఆధారాలు ఇప్పటికీ లేవని పరిశోధకులు అంటున్నారు.
అయితే మొబైల్‌ను అతిగా వాడటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు మాత్రం తలెత్తుతున్నాయి. ఎక్కువసేపు స్క్రీన్‌కి అతుక్కుపోవడం వల్ల తలనొప్పి, కళ్ల అలసట, నిద్రలేమి, ఒత్తిడి, మానసిక అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఫోన్ చూడటం నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ నుంచి వచ్చే నీలి కాంతి మెదడును అప్రమత్తంగా ఉంచి, నిద్ర వచ్చే ప్రక్రియను ఆలస్యం చేస్తుంది.
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో మొబైల్ ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. అప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ ఉద్గారాలు కూడా పెరుగుతాయి. అందుకే నెట్‌వర్క్ సరిగా లేని చోట ఎక్కువసేపు కాల్స్ చేయడం లేదా ఫోన్‌ను శరీరానికి దగ్గరగా ఉంచుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
మొబైల్ వాడకం వల్ల వచ్చే ప్రమాదాలను తగ్గించేందుకు కొన్ని చిన్న జాగ్రత్తలు చాలునని వైద్యులు చెబుతున్నారు. కాల్స్ సమయంలో ఇయర్‌ఫోన్స్ లేదా స్పీకర్ మోడ్ ఉపయోగించడం, ఫోన్‌ను ఎప్పుడూ జేబులో లేదా శరీరానికి అంటించి పెట్టుకోకుండా బ్యాగ్‌లో ఉంచడం, నిద్రపోయేటప్పుడు మొబైల్‌ను మంచానికి దూరంగా ఉంచడం వంటి అలవాట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోజులో కొంత సమయాన్ని ‘నో ఫోన్ టైమ్’గా నిర్ణయించుకుంటే మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది.
మొత్తానికి మొబైల్ వాడకం తప్పనిసరి అయిన ఈ కాలంలో భయపడటం కంటే జాగ్రత్తగా, నియంత్రణతో వాడటంే ఉత్తమ మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. టెక్నాలజీ మనకు సహాయకారిగా ఉండాలి కానీ ఆరోగ్యానికి భారంగా మారకూడదన్నదే వారి సూచన.
