పవన్ సినీ,రాజకీయ ప్రస్దానంపై కేటీఆర్ కామెంట్

పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్తానంతో పాటు సినిమాల్లో కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు కేటీఆర్. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను ‘వినయ విధేయ రామ’ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాప్రీరిలీజ్ ఫంక్షన్ ని హైదరాబాద్ లో భారీ ఎత్తున, అభిమానుల సమక్షంలో జరిగింది. ఈ సందర్బంగా సినిమా ట్రైలర్ ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి, కేటీఆర్ విడుదల చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ఇలా స్పందించారు.

మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ– ‘‘మొత్తం తెలుగు చలన చిత్రపరిశ్రమకు… ఇంకా చెప్పాలంటే భారత చలన చిత్రపరిశ్రమలో ఒక దిగ్గజం, ఒక మహానటుడు… స్వయంకృషితో ఈ రోజు పరిశ్రమలో….ఇప్పుడే చరణ్‌ చెప్పినట్లు…సముద్రమంత అభిమానాన్ని.. అద్భుతమైన వారసులను కూడా అందించిన పెద్దలు, గౌరవనీయులు మెగాస్టార్‌ చిరంజీవిగారికి నమస్కారం. చరణ్‌ స్పీచ్‌ వింటుంటే మేము ఎలక్షన్స్‌లో స్పీచ్‌లు ఇచ్చిన దానికంటే బాగానే మాట్లాడాడని చెప్పవచ్చు. మా సోదరుడు చరణ్‌ ఈ మధ్య చాకచక్యంగా హిట్స్‌ మీద హిట్స్‌ కొడుతున్నాడు. ‘ధృవ’కి కూడా నేను వచ్చాను. పెద్ద హిట్‌ సాధించింది. ‘రంగస్థలం’ సినిమా చేస్తున్నప్పుడు బయట కలిశాం. ఆ గడ్డం చూసి ఏ సినిమా చేస్తున్నావ్‌? అని అడిగా. ఇదంతా రూరల్‌ సెట్టింగు.

గ్రామీణ నేపథ్యంలో సినిమా అన్నాడు. నేను చచ్చినా చూడను ఆ సినిమా అన్నా. రిలీజ్‌ అయిన తర్వాత నా స్నేహితులు చాలా మంది చెప్పారు.. ఆ సినిమా అద్భుతంగా ఉందని. చూసిన తర్వాత చెబుతున్నాను.. అది నీ కెరీర్‌ బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌. ఈ సినిమాను ఎలక్షన్స్‌లో కూడా బాగా వాడుకున్నాను నేను. ఆ గట్టున ఉంటావా? ఈ గట్టున ఉంటవా? అని నా స్పీచ్‌లో ప్రతిచోటా వాడాను. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకి కూడా మంచి సంగీతం ఇచ్చాడు.

ఈ జోనర్‌ సినిమాలు నేను చూడను. కానీ బోయపాటిగారి కోసం చూస్తాను. చిరంజీవిగారి నుంచి వినయాన్ని, విధేయతను, సంస్కారాన్ని.. ఇలా అన్నింటినీ అలవరుచుకుని ఇండస్ట్రీలో అద్భుతమైన శక్తిగా ఎదుగుతున్న చరణ్‌కి హృదయపూర్వక శుభాకాంక్షలు. కల్యాణ్‌గారు ఇక్కడ లేరు. ఈ మధ్య రెండు మూడు సార్లు మాట్లాడాను. వారి రాజకీయ, సినీ ప్రస్థానం కూడా విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.