మన శరీరంపై ఉండే చిన్న పుట్టుమచ్చలు కేవలం అందానికి పరిమితమా.? లేక అవి మన భవిష్యత్తుకు సంకేతాలా..? అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం శరీరంలోని కొన్ని భాగాలపై పుట్టుమచ్చలు ఉంటే అదృష్టం కలిసి వస్తుందని, మరికొన్ని చోట్ల ఉంటే అనుకూలత తగ్గుతుందని విశ్వాసం. శతాబ్దాలుగా ప్రచారంలో ఉన్న ఈ శాస్త్రం.. పుట్టుమచ్చల స్థానాన్ని బట్టి వ్యక్తి జీవితంలోని సుఖసంతోషాలు, సంపద, గౌరవాన్ని అంచనా వేస్తుందని పండితులు చెబుతారు.
చెంపపై పుట్టుమచ్చ ఉన్నవారిని అదృష్టవంతులుగా సముద్ర శాస్త్రం పేర్కొంటుంది. ముఖ్యంగా ఎడమ బుగ్గపై పుట్టుమచ్చ ఉంటే ఆర్థిక సమస్యలు దూరంగా ఉంటాయని, జీవితంలో సంతోషం ఎక్కువగా ఉంటుందని నమ్మకం. ఇటువంటి వ్యక్తులు మాటలతోనే ఎదుటివారిని ఆకట్టుకునే శక్తిని కలిగి ఉంటారని కూడా చెబుతారు.ఛాతీ మధ్యలో పుట్టుమచ్చ ఉన్నవారికి సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుందని సముద్ర శాస్త్ర విశ్వాసం. వీరి జీవితంలో పేరు, ప్రతిష్ఠ సహజంగా వస్తాయని అంటారు. అలాగే నాభి మీద లేదా దాని చుట్టూ పుట్టుమచ్చ ఉంటే.. అది శుభ సూచకంగా భావిస్తారు. సంపదలో కొరత లేకుండా, కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుందని పండితుల అభిప్రాయం.
నుదిటిపై పుట్టుమచ్చ ఉండటం చాలా శుభప్రదమని చెబుతారు. ఇలాంటి వారు ధనలాభాన్ని ఎప్పుడూ కోల్పోరని, అదృష్టం వారిని అనుసరిస్తుందని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. గొంతు దగ్గర పుట్టుమచ్చ ఉన్నా మంచిదేనని విశ్వాసం. మాటకు విలువ, వ్యక్తిత్వానికి గుర్తింపు లభిస్తుందని అంటారు. ముక్కుపై పుట్టుమచ్చ ఉంటే.. ఆ వ్యక్తి జీవితంలో బాగా సంపాదిస్తాడని అర్థమట. ఆర్థికంగా స్థిరపడతాడని, అవసరాలకు లోటు ఉండదని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. అలాగే అరచేతిలో పుట్టుమచ్చ ఉండటం ఆనందం, శ్రేయస్సుకు సంకేతంగా భావిస్తారు. జీవితంలో అవకాశాలు సులభంగా కలిసి వస్తాయని నమ్మకం.
ఇలా చిన్నగా కనిపించే పుట్టుమచ్చలే పెద్ద అదృష్టానికి సంకేతాలని సముద్ర శాస్త్రం వివరిస్తుంది. అయితే ఇవన్నీ విశ్వాసాలపై ఆధారపడ్డ అంశాలేనని పండితులు కూడా స్పష్టం చేస్తారు. (గమనిక:ఈ కథనంలో పేర్కొన్న సమాచారం సాముద్రిక శాస్త్రం, సంప్రదాయ విశ్వాసాల ఆధారంగా మాత్రమే అందించబడింది. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకులు దీనిని సమాచారం, ఆసక్తి కోసమే పరిగణించాలి.)
