పుట్టిన తేదీ కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు.. అది మీ జీవితానికి దిశానిర్దేశం చేసే సంకేతమని న్యూమరాలజీ విశ్వాసాలు చెబుతాయి. ముఖ్యంగా 6, 15 లేదా 24 తేదీల్లో జన్మించినవారికి రాశి సంఖ్య 6గా పరిగణిస్తారు. ఈ సంఖ్య శుక్ర గ్రహానికి ప్రతీకగా భావిస్తారు. అందం, ఆనందం, ప్రేమ, ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడి ప్రభావంతో 6 సంఖ్య ఉన్నవారి జీవితాలు ప్రత్యేకంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు.
న్యూమరాలజీ ప్రకారం 6 సంఖ్య లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. అందుకే ఈ సంఖ్య ఉన్నవారు పుట్టుకతోనే అదృష్టాన్ని వెంట తీసుకువస్తారట. వారి జీవితాల్లో సంపద, సౌఖ్యం, రాజవైభవం సహజంగానే చేరుతుందని విశ్వాసం. మొదటి చూపులోనే ఎదుటివారిని ఆకట్టుకునే వ్యక్తిత్వం వీరి ప్రధాన బలం. మధురమైన మాటలు, సహజ సౌందర్యం, స్నేహపూర్వక స్వభావం వల్ల ఎక్కడ ఉన్నా ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తారు.
6 సంఖ్య ఉన్నవారు ఉన్నచోట ఆనందం పంచుతారని అంటారు. వారి ఇళ్లు ఎప్పుడూ సందడిగా ఉంటాయి. అతిథి సత్కారంలో ముందుంటారు. విలాసవంతమైన జీవనశైలి వీరి మరో లక్షణం. మంచి ఆహారం, స్టైలిష్ దుస్తులు, లగ్జరీ వాహనాలు, అందమైన ఇళ్లు… ఇవన్నీ వారి జీవితంలో భాగమే. సంపాదన విషయంలోనూ, ఖర్చు విషయంలోనూ వీరు వెనుకాడరని నమ్మకం.
డబ్బు, ఆనందానికి కారకుడైన శుక్రుడి ప్రభావంతో 6 సంఖ్య ఉన్నవారు ఫ్యాషన్, అందం, ఆభరణాలు, హోటల్ వ్యాపారం, సినిమా, సంగీతం, ఇంటీరియర్ డిజైన్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో రాణిస్తారని చెబుతారు. సృజనాత్మకతతో పాటు సంపాదించే నైపుణ్యం కూడా వీరిలో సహజంగా ఉంటుందని న్యూమరాలజీ నిపుణుల మాట. కొందరి జీవితాల్లో 30 లేదా 40 ఏళ్ల వయస్సుకే భారీ ఆస్తులు, ఉన్నత స్థానం లభిస్తాయని విశ్వాసం.
ప్రేమ విషయానికి వస్తే.. 6 సంఖ్య ఉన్నవారు ప్రేమను హృదయపూర్వకంగా పంచుతారు. తమ భాగస్వామిని రాజు లేదా రాణిలా చూసుకునే స్వభావం వీరిదట. వివాహ జీవితం ఆనందంగా, సౌఖ్యంగా సాగుతుందని నమ్మకం. వీరి ఇంట్లో ప్రేమ, నవ్వులు, సంతోషం ఎప్పుడూ కనిపిస్తాయని చెబుతారు. న్యూమరాలజీ ప్రకారం 2, 3, 6, 9 సంఖ్యలతో మంచి అనుబంధం ఏర్పడుతుందని విశ్వాసం. మాధురి దీక్షిత్, ఐశ్వర్య రాయ్, షారుఖ్ ఖాన్, నీతా అంబానీ వంటి ప్రముఖులకు కూడా 6 సంఖ్య ప్రభావం ఉందని న్యూమరాలజీ విశ్వాసాలు చెబుతుంటాయి. అందుకే ఈ సంఖ్యను అదృష్టానికి చిహ్నంగా చాలామంది భావిస్తారు. (గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు మత, న్యూమరాలజీ విశ్వాసాల ఆధారంగా రూపొందించబడింది.దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)
