కరోనా మహమ్మారీ ప్రపంచానికి రకరకాల పాఠాల్ని నేర్పిస్తోంది. పనిలో పనిగా సినీరంగం రూపురేఖల్ని మార్చే డిక్టేటర్ లా మారింది. ఇప్పటికే థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే విధానానికి స్వస్థి చెప్పాలని కరోనా సందేశం ఇచ్చింది. ఇంట్లోనే కూచుని కుటుంబ సమేతంగా ప్రొజెక్షన్ లో లేదా హైఎండ్ స్మార్ట్ టీవీనే థియేటర్ గా మార్చుకుంటే బెటర్ అన్న సందేశాన్ని జనాల్లోకి పంపించింది. దీనర్థం డిజిటల్ స్ట్రీమింగుకి ఊపు పెరిగిందనే. ఈ పర్యవసానం మునుముందు ఎగ్జిబిషన్ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుందని అంచనా వేస్తున్నారు. కరోనా మహమ్మారీ కి వ్యాక్సినేషన్ వచ్చేప్పటికి ఆడియెన్ మైండ్ సెట్ పూర్తిగా మారిపోయేందుకు ఆస్కారం ఉంది. థియేటర్ల కంటే డిజిటల్- ఓటీటీపైనే ఆధారపడే ఆలోచన యూత్ లో మరింతగా పాకిపోతుందని చెబుతున్నారు.
ఇప్పటికే అమెజాన్ – నెట్ ఫ్లిక్స్- ఈరోస్- హాట్ స్టార్ వంటి ఆన్ లైన్ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలు వినోదాన్ని నేరుగా స్మార్ట్ ఫోన్ లో ఇండ్లలోకే అందుబాటులోకి తేవడంతో జనం వీటికి అడిక్ట్ అవుతున్నారని అర్థమవుతోంది. ఇదొక్కటే సమస్య కాదు.. ఇకపై టాలీవుడ్ కథల నేపథ్యం కూడా అమాంతం మార్చుకోవాల్సిన సన్నివేశం కనిపిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంతకుముందులా ఇమాజినేషన్ కి స్వేచ్ఛ లేదు. విదేశీ కథలకు ఆస్కారం లేనే లేదు. ఎందుకంటే.. మన దర్శకరచయితలు ఎక్కువగా ఊహించే కథలన్నీ విదేశీ నేపథ్యం ఉండేవే. కరోనా భీభత్సం భారత్ కంటే అమెరికా- బ్రిటన్ – స్పెయిన్ – ఫ్రాన్స్ సహా యూరప్ దేశాల్లో కథలు తిరుగుతుంటాయి. అయితే అక్కడ కరోనా తీవ్రంగా ఉండడంతో అలాంటి చోటికి వెళ్లి షూటింగులు చేయడం అవివేకం అన్న విశ్లేషణ ఊపందుకుంది. అక్కడ లక్షలాది కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. మహమ్మారీ భీతావహ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఇలాంటప్పుడు మన స్టార్ హీరోలు టెక్నికల్ టీమ్ లు అలాంటి ప్రమాదకర స్థలానికి వెళ్లి షూటింగులు చేయడం ఇంకెలాంటి ముప్పుగా మారుతుందోనన్న ఆందోళనా పరిశ్రమలో అభిమానుల్లో నెలకొంది. ఇప్పుడున్న సన్నివేశం చూస్తుంటే వ్యాక్సినేషన్ వచ్చేందుకే ఏడాది నుంచి రెండేళ్లు పట్టొచ్చన్న ఊహాగానాల నడుమ పరిస్థితిని అదుపు చేయడం అంత ఈజీ ఏమీ కాదు. ఇలాంటప్పుడు విదేశీ నేపథ్యం ఉన్న కథల్ని ఎంచుకుని పరదేశాలకు వెళ్లి రిస్క్ చేయడం సరైనదేనా? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అందుకే ఇప్పుడు టాలీవుడ్ సహా దేశీ సినీపరిశ్రమల కథలు మారాల్సిన టైమ్ వచ్చేసిందన్న విశ్లేషణ సాగుతోంది. ఇన్నాళ్లు అమెరికా- ఎన్నారై బ్యాక్ డ్రాప్ కథలకు తెలుగు సినీదర్శకనిర్మాతలు హీరోలు ప్రాధాన్యతనిచ్చారు. అలాగే డాలర్ తో ముడిపడిన విదేశీ కథల అవసరం ఇంతకుముందు ఉండేది. కానీ ఇకపై రెండేళ్ల పాటు అలాంటి కథలకు ఆస్కారం లేదని పలువురు రచయితలు చెబుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సన్నివేశంలో విదేశాలకు వెళ్లే కథలు అనవసరం అన్న వాదనా దర్శకరచయితల్లో మొదలైందట.
పనిలో పనిగా మునుపటిలా ఆకాశాన్నంటే బడ్జెట్లు .. పాన్ ఇండియా రేంజ్ ప్లానింగ్స్ కూడా సరికాదన్న విశ్లేషణ ఇప్పటికే మొదలైంది. ఇంతకుముందులా థియేటర్లలో రిలీజ్ చేయాలన్న ఆలోచన కానీ.. పాన్ ఇండియా రేంజులో దేశ విదేశాల్లో రిలీజ్ చేయాలన్న ఆలోచన కానీ సరైనది కాదు. అలా చేయాలంటే బడ్జెట్ల రేంజు అసాధారణంగా ఉంటుంది. అది సరికాదని విశ్లేషిస్తున్నారు. పరిస్థితి పూర్తిగా సర్థుకునే వరకూ ఇలా ఆలోచించడమే కరెక్ట్. కాస్ట్ కంట్రోల్ ఉండే వెబ్ సిరీస్ ల నిర్మాణం .. టీవీ సిరీస్ ల నిర్మాణంతో కొంతవరకూ పరిశ్రమను కాపాడుకోవడం ఇంపార్టెంట్ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే నేటివిటీ ఉన్న చిన్న సినిమాలకు ఇది ఊపు పెంచే తరుణం అని కూడా విశ్లేషిస్తున్నారు. ఇక థియేటర్లను గుప్పిట పట్టి పరిశ్రమల్ని నడిపించే ఆ నలుగురికి కరోనా చెంప దెబ్బ మామూలుగా లేదని కొందరు చెబుతున్నారు. ఎగ్జిబిషన్ రంగంపై దెబ్బ పడడం అంటే ఆ నలుగురిపైనా పంచ్ పడడమే. ఇన్నాళ్లు చిన్న సినిమాల నిర్మాతల గోడు వినే నాధుడే లేకపాయే. టాలీవుడ్ లో ఇలాంటి ఎన్నో సమస్యలకు కరోనా చెంప పెట్టు లాంటి సొల్యూషన్ ఇస్తోంది. అన్నిటికీ ఒకే ఒక్క కరోనా సమాధానమిస్తోంది. బూర్జువా వర్గాలకు సరికొత్త గుణపాఠం నేర్పించింది! అంటూ పలువురు గుసగుసలాడడం చర్చకొచ్చింది. తాజా సన్నివేశం ఒక వర్గానికి మింగుడుపడనిది. చిన్న సినిమా నిర్మాతలకు ఒక రకంగా ఊరట పెంచేది అన్న విశ్లేషణ కూడా తాజాగా సాగుతోంది.