డేంజర్ జోన్‌లో టాలీవుడ్.. ఇది పెద్దల తప్పిదం!
టాలీవుడ్ కి ఓటీటీ పెను ప్రమాదాల్ని సృష్టించనుందా? అంటే అవుననే విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే జనం ఓటీటీ డిజిటల్లో సినిమాలకు అలవాటు పడ్డారు. పర్యవసానంగా థియేటర్లకు వచ్చే వారి శాతం అమాంతం పడిపోనుందని తాజాగా అమెరికాలో నిర్వహించిన ఓ సర్వే వెల్లడిస్తోంది. మహమ్మారీ లాక్ డౌన్ లు ఎత్తేసి థియేటర్లు తెరిచినా 70 శాతం జనం థియేటర్లకు రాకపోవచ్చన్నది ఓ సర్వే రిపోర్ట్.
ఒకవేళ ఇదే నిజమైతే తెలుగు సినిమాలకు తెలుగు మార్కెట్ ఒక్కటే దిక్కు అవుతుంది. అమెరికాలో సినిమాలు కొనేవాళ్లు కరువవుతారన్న ఆందోళనా వ్యక్తమవుతోంది. ఏపీ నైజాంలో బిజినెస్ అయినా.. అమెరికాలో లైట్ తీస్కుంటే ఆ మేరకు తెలుగు సినిమా బిజినెస్ రేంజు అమాంతం తగ్గిపోతుంది. ఇప్పటికే అమెరికా మరో నైజాంగా మారి ఆదుకుంటోంది. బాహుబలి తర్వాత ట్రెండ్ మారింది. అమెరికా మార్కెట్లో తెలుగు అగ్ర హీరోల సినిమాలే కాక చిన్న హీరోల సినిమాలకు బిజినెస్ రేంజ్ పెరిగింది. కానీ ఓటీటీ దెబ్బకు ఇప్పుడు పరిస్థితి మారనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. యుఎస్ లో జనం ఓటీటీకి అడిక్ట్ అయ్యి థియేటర్లకు రావాలనుకోకపోతే పరిస్థితి ఏమిటి? ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆడియెన్ కి ఓటీటీలు చేరువ కావడంతో ఇక్కడా మార్పులు సంభవిస్తే ఏమవుతుంది? అంటూ ఎగ్జిబిటర్లు సహా టాలీవుడ్ సినీపెద్దల్లోనూ ఆందోళన మొదలైందట.
అయితే ఈ పాపం ఎవరిది? అంటే.. ఇన్నాళ్లు ఓటీటీ ఉన్నా ఫర్వాలేదు అంటూ వెనకేసుకు వచ్చిన అగ్ర నిర్మాతలు డి.సురేష్ బాబు.. దిల్ రాజు సహా సినీపెద్దల ఖాతాలోకే వెళుతుంది ఆ క్రెడిట్ అంతా. వీళ్ల వల్లనే ముప్పు. ఆ నలుగురు తీసే లేదా ఆ పది మంది తీసే సినిమాలకు మార్కెట్ ఏదోలా అయిపోతుంటే.. చిన్న సినిమాలు మధ్యస్థ బడ్జెట్ సినిమాలకు ఓటీటీ అనేది ముప్పుగా మారనుందని భావిస్తున్నారు. మరి దీనికి సొల్యూషన్ ఏమిటో సినీపెద్దలే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు థియేటర్లలోకి వచ్చేందుకు 20 సినిమాలు వెయిటింగులో ఉన్నాయి. వీటన్నిటినీ ఓటీటీలో చూడాలన్న ఉత్సాహం ఆడియెన్ కి ఉంది. మరి ఈ పరిస్థితిని మార్చేదెలా? అన్నది పెద్దలే తేల్చాలి.