కృష్ణానగర్ – యూసఫ్ గూడలో 70మందికి వైరస్
తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక రకమైన సందిగ్ధ పరిస్థితిలో ఉందిప్పుడు. కొవిడ్ మహమ్మారీ దెబ్బకు ఏం చేయాలో పాలుపోని స్థితిలో అల్లాడుతోంది. ఓవైపు షూటింగులు చేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతిచ్చినా.. సెట్స్ కెళ్లాలంటేనే బెంబేలెత్తే పరిస్థితి ఉంది. షూటింగులు అనగానే హైదరాబాద్ లో మూడు ప్రాంతాలు ఎంతో కళకళలాడుతుంటాయి. ఆ మూడు చోట్లా ఇప్పుడు టెన్షన్ టెన్షన్. కృష్ణానగర్ – గణపతి కాంప్లెక్స్ ఏరియా.. ఇందిరా నగర్ – యూసఫ్ గూడ ఏరియా.. అలాగే ఫిలింనగర్ ఏరియాలో ఒకటే టెన్షన్ టెన్షన్ గా ఉందని తెలిసింది.
ఓవైపు బుల్లితెర షూటింగుల కోసం ఆర్టిస్టులు రోడ్లపైకి వస్తున్నారు. వారికి నిర్ధేశించిన వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. టీవీ ఆర్టిస్టులు అధికంగా రెంట్లకు ఉండే గణపతి కాంప్లెక్స్ ఏరియాలో ఇతర చోట్ల కూడా మరింతగా సందడి మొదలైంది. అయితే ఉన్నట్టుండి పలువురు టీవీ ఆర్టిస్టులకు కరోనా పాజిటివ్ అని తెలియగానే అక్కడ ఊహించని ఉలిక్కిపాటుతో టెన్షన్ వాతావరణం అలుముకుందట.
కేవలం గణపతి కాంప్లెక్స్ లో పలువురు టీవీ ఇండస్ట్రీ టెక్నీషియన్లు.. ఆర్టిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చిందన్న వార్తలు కలకలం రేపాయి. వైరస్ పాజిటివ్ ఉన్నా బయటకు చెప్పకుండా పలువురు అందరితో కలిసిపోతుండడంతో అది కాస్తా తీవ్ర ఆరోపణలకు కారణమైంది. గణపతి కాంప్లెక్స్ లో ఓ ఏడుగురు కరోనా పాజిటివ్ అని తెలిసీ తమను ఏమీ చేయదన్న ధీమాతో ఉన్నారని ఓ వాయిస్ ఓవర్ ఈ బుధవారం నాడు మీడియా సహా నటీనటుల వాట్సాప్ గ్రూపుల్లో హట్ చల్ చేస్తోంది. వీళ్లంతా గణపతి కాంప్లెక్స్ లో నివశించేవారేననేది ఆ వాయిస్ సందేశం. అంతేకాదు.. సినిమా టీవీ ఆర్టిస్టులు నివశించే ఒక్క యూసఫ్ గూడ ఏరియాలోనే దాదాపు 70 మంది పైగా వైరస్ భారిన పడ్డారని ఆ వాయిస్ లో వినిపించడం చూస్తుంటే టెన్షన్ ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవచ్చు.
టీవీ నటుడు ప్రభాకర్ .. నా పేరు మీనాక్షి సీరియల్ నటి నవ్యకు కరోనా పాజిటివ్ అన్న వార్తలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. బండ్ల గణేష్.. శిల్పా రెడ్డి సహా పలువురు సినీఇండస్ట్రీ ప్రముఖులకు వైరస్ పాజిటివ్ రావడం వారితో సన్నిహితులు క్వారంటైన్ కి వెళ్లడం తెలిసిందే. ఓ ప్రముఖ నిర్మాత కం డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ స్టాఫ్ కి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ ఆఫీస్ ని మూసేశారని వార్తలొచ్చాయి. అయితే బయటి ప్రపంచానికి తెలియకుండా వందలాది మంది ఇండస్ట్రీ వ్యక్తులు కొవిడ్ భారిన పడడం కలకలం రేపుతోంది. దీనిపై ఫిలింనగర్ కృష్ణానగర్ సహా యూసఫ్ గూడలో గుసగుసగా మాట్లాడుకోవడం వినిపిస్తోంది. తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్టుల సంఘం (టీఎంటీఏయు)లోనూ దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.