‘ శ్రీనివాస కల్యాణం’ రివ్యూ : బలహీన పెళ్లి వైభవం

రచన – దర్శకత్వం : సతీష్ వేగ్నేశ
తారాగణం : నితిన్, రాశీ ఖన్నా, జయసుధ, ఆమని, మీనా, సితార, పూనం కౌర్, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, నరేష్, అజయ్, సత్యం రాజేష్, ప్రవీణ్ తదితరులు
సంగీతం “ మిక్కీ జే మేయర్, ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్
నిర్మాత : దిల్ రాజు
విడుదల : జులై 9, 2018
2.5 / 5
***

టాలీవుడ్ కరణ్ జోహార్ దిల్ రాజు తన సెంటిమెంటల్ ఫ్యామిలీ సినిమాల పరంపరని అటు తిప్పి ఇటు తిప్పి కొనసాగిస్తున్నారు. తాజాగా ‘లవర్’ అనే యాక్షన్ మూవీలో సైతం బలవంతంగా ఫ్యామిలీ సంగతులు జొప్పించి భంగపడ్డాక, ఈసారి కల్తీలేని ప్యూర్ ఫ్యామిలీని, దాని జానర్ మర్యాద కొద్దీ కాపాడుకుంటూ నిర్మించారు. దిల్ రాజుతోనే తరాల అంతరాల ‘శతమానం భవతి’ అనే ఫ్యామిలీ తీసిన దర్శకుడు సతీష్ వేగేశ్న, మళ్ళీ ఫ్యామిలీనే నమ్ముతూ- సాంప్రదాయ పెళ్ళిళ్ళు, వాటి ఆచార వ్యవహారాల తంతూ ఒక వైభవంలా తీసి ప్రేక్షకుల ముందుంచాడు. హుషారు ప్రేమ కథలతో పాపులరైన హీరో నితిన్ ఇప్పుడు పెళ్లి సాంప్రదాయాలకి బ్రాండ్ అంబాసిడర్ గా బరువైన పాత్రతో, గ్లామర్ హీరోయిన్ రాశీ ఖన్నాని వెంటబెట్టుకుని బాక్సాఫీసు పరీక్షకి నిలబడ్డాడు. వీటి ఫలితాలు ఎలా తేలాయో ఈ కింద చూద్దాం…

కథ
చండీఘర్ లో ఆర్కిటెక్చర్ గా పనిచేసే శ్రీనివాస రాజు (నితిన్), కాఫీ షాప్ లో పార్ట్ టైంజాబ్ చేసే శ్రీదేవీ (రాశీ ఖన్నా) ప్రేమించుకుంటారు. ఆంధ్రాలో సఖినేటి పల్లి గ్రామంలో ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన శ్ర్రేనివాస్, నానమ్మ (జయసుధ) ప్రభావం కొద్దీ, పెద్దలు కుదిర్చే, రోజుల తరబడి అట్టహాసంగా జరిగే, సాంప్రదాయ పెళ్ళిళ్ళని నమ్ముతాడు. శ్రీదేవి తండ్రి ఆర్కే హైదరాబాద్ లో క్షణం తీరికలేని బిజినెస్ మాగ్నెట్. హెలికాప్టర్ మీద తిరుగుతాడు. ఆచార వ్యవహారాలు టైంవేస్ట్ అనుకుంటాడు. టైంని డబ్బుతో కొలుస్తాడు. అలాటి అర్కేకి, శ్రీనివాస్ అతడి కూతురు శ్రీదేవితో పెళ్లి ప్రతిపాదన చేస్తాడు. కూతురి కోసం ఒప్పుకుంటాడు ఆర్కే. ఈ పెళ్లి తమ గ్రామంలో సాంప్రదాయ బద్ధంగా జరగాలంటాడు శ్రీనివాస్. అయితే ఒక ఒప్పందం మీద సంతకం పెట్టమంటాడు ఆర్కే. ఎప్పుడు తన కూతురు విడిపోవాలన్నా, న్యూసెన్స్ చేయకుండా వుండేందుకు, ఇప్పుడే విడాకుల ఒప్పందం మీద సంతకం పెట్టమంటాడు. ఆ సంతకం పెట్టిన శ్రీనివాస్ కౌంటర్ కండిషన్ పెడతాడు.
ఇప్పుడు ఈ కౌంటర్ కండిషన్ ఏమిటి? ఈ పెళ్లి జరిగిందా లేదా? అగ్రిమెంట్ల వల్ల ఏ సమస్యలు తలెత్తాయి?…అన్నది మిగతా కథ.
ఎలావుంది కథ
ఫ్యామిలీ అంతా కూర్చుని చక్కగా చూసేట్టు వుంది. పెళ్లి తంతులో అంతరించి పోయిన చాలా ఆచారాలని మళ్ళీ గుర్తు చేసేలా వుంది. ఇక వాటికి తిరిగి ప్రాణం పోయడం ప్రేక్షకుల బాధ్యతే. త్రేతాయుగంలో రాముడి పెళ్లి, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి పెళ్లి, కలియుంలో వెంకటేశ్వరుడి పెళ్ళీ చూపించి – దేవుళ్ళే పెళ్ళిళ్ళకి అంతంత ప్రాముఖ్యాన్నీ పవిత్రతనీ కల్పిస్తే, వాటిని ముందుకు తీసికెళ్ళడం మన ధర్మమని చెప్పే సందేశాత్మక కథ. దీని మార్కెట్ యాస్పెక్ట్ కోసం నలభైల్లో పడ్డ ఫ్యామిలీ ప్రేక్షకుల ఆధార పడ్డారని స్పష్ట మవుతూంటుంది. కాబట్టి ఎక్కడా యూత్ అప్పీల్ జోలికి పోలేదు.

ఎవరెలా చేశారు
పెళ్లి సాంప్రదాయాలకి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు నితిన్ ప్రవచనాలు చేస్తూ, సందేశాలిస్తూ ఈసారి యువప్రేక్షకుల ఆశలకి దూరంగా వుండి పోయాడు. వినోద కాలక్షేపాలకి స్కోపు లేని ఫిలాసఫిల్ షేడ్ వున్నపాత్ర… పాత్రెలా వున్నా ఇచ్చిన పాత్రని నీటుగా, హుందాగా పోషించాడు. ‘చిలసౌ’ లో సుశాంత్ కూడా నీటుగా హుందాగానే పాత్ర పోషణ చేశాడు. అయితే అది యూత్ ని ఆకట్టుకునే గుర్తుండిపోయే యువ పాత్ర. నితిన్ ది వచ్చేసి – ఫ్యామిలీ ప్రేక్షకుల్లో పేరెంట్స్ కి – మనకబ్బాయి వుంటే ఇలా వుండా లన్పించే సంసార పక్షపు పాత్ర. ఈ వెరైటీ కూడా యువప్రేక్షకులు పెద్ద మనసు చేసుకుని చూడాలి తప్పదు. అయితే ఈ బరువైన పాత్రలో కూడా నితిన్ తెలియకుండానే దారి తప్పి అందరికీ రాంగ్ మెసేజ్ ఇచ్చేశాడు చివరికి. తను అంత ఉదాత్తంగా చెప్పుకొచ్చే పెళ్లి కాన్సెప్ట్ కే తూట్లు పొడిచాడు. ఈ పొరపాటు దర్శకుడిదే కావచ్చు. కానీ తెలుసుకుని నివారించుకోవడం కథానాయకుడిగా నితిన్ బాధ్యత.
ప్రకాష్ రాజ్ ది మాత్రం అర్ధవంతమైన పాత్ర. అడ్డగోలు వాదనతో ప్రత్యర్ది పాత్ర బ్యాడ్ గానే వుంటాడు. అది అతడి బాధ్యత. అందుకని ప్రత్యర్ధులున్నంత అర్ధవంతంగా హీరో పాత్రలుండవు. ప్రకాష్ రాజ్ క్యారక్టర్ ఆర్క్ చివరంటా ఒక అర్ధవంతమైన జర్నీ. తప్పు తెలుసుకుని పరివర్తన చెందేప్పుడు చెప్పే మాటలు ప్రత్యర్దిలోని సున్నిత కోణాన్ని అపూర్వంగా బయట పెడతాయి. బిజినెస్ మాగ్నెట్ గా ఎంత టఫ్ గా వుంటాడో, కూతురి పెళ్లి చేసే తండ్రిగా అంత స్మూత్ అయిపోతాడు సాంప్రదాయాలకి తలొగ్గి.
నానమ్మ పాత్రలో జయసుధది కూడా అర్ధవంతమైన పాత్ర. నిత్యం సాంప్రదాయాల గురించి ఘోషించే ఆమె కథకి కేంద్ర బిందువు. ఆయితే డెబ్బై ఏళ్ల మనిషిగా అన్పించాలంటే కొంచెమైనా జుట్టు తెల్లబడాలి. కలర్ వేసుకుంటోందా? మళ్ళీ అదేం సాంప్రదాయం!
హీరోయిన్ రాశీఖన్నా గ్లామర్ కి పరిమితమైన పాత్ర. ఫారిన్లో చదివి కూడా తండ్రితో, ప్రేమించిన వాడితో అణిగిమణిగి వుండే గుణం. ఈమె చండీఘర్ లో జాబ్ చేయడం అసహజ కథనం. ఈమె రిచ్ అని హీరోకి తెలుస్తుంది. ఈమె ఫారిన్లో చదువుకుని వచ్చాక, ప్రపంచం చూసి రమ్మని, అయితే తన కూతురని ఎక్కడా చెప్పుకోవద్దని చెప్పి తండ్రి ఆర్కే పంపించాడు. అదేమిటి? ఫారిన్లో చదివి ప్రపంచం చూడలేదా? కేవలం ఆమె హీరోతో బాటు చండీఘర్ లో వుండేందుకే ఈ ఫాల్స్ డ్రామా క్రియేట్ చేసినట్టుంది.
మిగతా తారాగణంలో ప్రముఖులే వున్నారు. ఆమని, మీనా, సితార, శ్వేతా నందిత, పూనం కౌర్, రాజ్, రాజేంద్ర ప్రసాద్, నరేష్, అజయ్, సత్యం రాజేష్, ప్రవీణ్ …ఇలా ప్రతీ సీనులో ప్రతీ పాత్రలో ప్రముఖులే కనిపిస్తూ విజువల్స్ ని కనువిందు చేస్తారు. అయితే పాత్రలు ఎక్కువై పోయేసరికి పాత్రచిత్రణలు కుదరలేదు. దీంతో ఎంత ఉదాత్తమైన, బరువైన కథైనప్పటికీ నటనలు పైపైనే కన్పిస్తాయి.
సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం ఒక దృశ్య వైభవాన్ని సృష్టించింది. కొనసీమ పచ్చదనాల చిత్రీకరణ క్లాస్ గా వుంది. దిల్ రాజు ఇటీవలి సినిమాలో ఇంత రిచ్ ప్రొడక్షన్ వుఇలువలున్న సినిమా ఇదే. ఇక మిక్కీ జే మేయర్ పాటలు చూస్తున్నంత సేపూ ఒకే. తర్వాత గుర్తుండవు. రచనాపరంగా అనేక చోట్ల సతీష్ వేగేశ్న డైలాగులు బలంగా వున్నప్పటికీ, సందేశాలివ్వడం ఎక్కువైపోయింది.

చివరికేమిటి?
ఫస్టాఫ్ ప్రేమించుకునే దృశ్యాలతో సాధారణంగా సాగుతుంది. పెళ్ళికి అంత పెద్ద పీటవేసినప్పుడు ప్రేమకి కూడా వేయాలిగా – ఈ ప్రేమ యాంత్రికంగా సాగిపోతుంది. ఎప్పుడెప్పుడు ఈ ప్రేమని ముగించి సెకండాఫ్ లో పెళ్లి కార్యక్రమాలు ప్రారంభిద్దామా అన్నటుంటుంది. సెకండాఫ్ అంతా ఎడతెగని పెళ్లి కార్యక్రమాల మధ్య నడిచే సీన్లే. ఇందులో నితిన్ క్యారెక్టర్ గల్లంతే. ఎప్పుడైతే ప్రేమ కథలో ప్రేమికుల పెళ్లి పెద్దల చేతికెళ్ళి పోతుందో, ఇక ఆ ప్రేమికుల పాత్రలు గల్లంతై పోతాయి. నితిన్ పాత్ర పూర్తిగా పాసివ్ –డల్ పాత్రయిపోతుంది, క్లయిమాక్స్ లో కళ్ళుతెరిచినట్టు లెక్చర్ ఇవ్వడం తప్పితే.
ఈ లెక్చరే మొత్తం వ్రతాన్ని- పెళ్లి కాన్సెప్ట్ ని చెడగొట్టింది. విడాకుల పత్రాల మీద సంతకం పెట్టినందుకు పెళ్లి పీటల మీంచి లేచిపోయి ఎమోషనల్ అవుతాడు. దర్శకుడు ఈ విడాకుల పత్రాల్ని ప్రీ మారిటల్ అగ్రిమెంట్ అంటూ, ఇది అమెరికాలో వుందనీ, ఇప్పుడు ఇండియా కొచ్చిందనీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇండియాలో ఇది ఎప్పట్నించో వుంది. పైగా దర్శకుడు చెప్పిన అర్ధంలో కాదు. పెళ్ళికి ముందు విడాకుల పత్రాల మీద సంతకం పెట్టడం ఎక్కడా వుండదు. ఒకవేళ విడకులైతే, పంపకాలేమిటన్న, పిల్లల సంరక్షణేమిటన్న వాటి గురించే అవగాహనా పత్రం వుంటుంది. దీన్ని కోర్టులు ఒప్పుకుంటాయి. ఇది వధూవరులు ఇద్దరికీ తెలిసే చేసుకుంటారు. దీన్ని వక్రీకరిస్తే ఎలా?

కూతురికి తెలియకుండా ఆమె తండ్రి ఈ ఒప్పందం మీద సంతకం ఎలా చేయించు కుంటాడు? హీరో కూడా ఎలా ఒప్పుకుంటాడు? అసలు పెళ్లిని పవిత్రంగా భావించే హీరో, ముందస్తు విడాకుల అగ్రిమెంట్ తో పెళ్లి పవిత్రతని ఎలా చెడగొడతాడు? హీరో లక్ష్యం ఏమిటి? సాంప్రదాయాలకి అనుగుణంగా హీరోయిన్ తండ్రి తలవంచేలా చేయడమేగా? అలాంటప్పుడా అగ్రిమెంటు సంతకం చేయకుండా చించేసి, తానే షరతు విధిస్తే సరిపోయేది. పాత్ర నిలబడేది. కాన్సెప్ట్ దక్కేది. క్లయిమాక్స్ మెరుగయ్యేది. ఇంకా చాలా విషయాలు బాగు పడేవి.

―సికిందర్