అపరిచితుడై వచ్చాడు! (‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ రివ్యూ)

-సికిందర్

Rating : 2 / 5

అపజయాల పరంపరలోంచి విజయం వైపు పయనిద్దామని వచ్చారు రవితేజ, శ్రీను వైట్ల. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ తో మాస్ కమర్షియల్ మెరుపులతో అభిమానుల్ని ఫిదా చేయడం ఇక ఖాయమని ప్రకటనలిచ్చుకున్నారు. మంచి మంచి ఇంటర్వ్యూ లిచ్చి ఆసక్తిని పెంచారు. టీజర్ వదిలి థ్రిల్ చేశారు. ట్రైలర్ వదిలి షాకిచ్చారు. ఈ ట్రైలర్ లాగే సినిమా వుంటే ఏంటి పరిస్థితి అన్పించారు. నిజంగా ట్రైలర్ లాగే సినిమావుందా, లేక టీజర్ లాగా వుంటూ తేజ – వైట్లల తేజం పెంచిందా ఓసారి చూద్దాం.

కథ

2003 లో అమెరికాలో చిన్నప్పుడు అమర్ (రవితేజ), ఐశ్వర్య (ఇలియానా)ల తండ్రులు ఒక ఫార్మా కంపెనీ నడుపుతూ నల్గురు ఉద్యోగులకి వాటాలిస్తారు. ఆ నల్గురు ఉద్యోగులు ఆ తండ్రుల్ని చంపేసి కంపెనీని హస్తగతం చేసుకుంటారు. పద్దెనిమిదేళ్ళ తర్వాత అమర్ పగదీర్చుకోవడం ప్రారంభిస్తాడు. ఐశ్వర్య ఇందుకు తోడవుతుంది. ఇద్దరికీ ఒక మానసిక సమస్య వుంటుంది. దీంతో అమరే అక్బర్ గా, ఆంటోనీగా కన్పిస్తూంటాడు. ఐశ్వర్య ఇంకోలా బిహేవ్ చేస్తూంటుంది. ఈ నేపధ్యంలో తమ తండ్రుల్ని చంపిన నల్గురు హంతకుల్ని ఎలా అంతమొందించి పగదీర్చుకున్నారన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

డిససోషియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ (డిఐడి) అనే మానసిక రుగ్మత ఆధారంగా ఈ కమర్షియల్ మాస్ కథ చెప్పాలనుకున్నారు. నిజానికి మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ (ఎంపిడి) కి ఇది కొత్త పేరే తప్ప కొత్త మానసిక వ్యాధికాదు. ఎంపీడితో ఆల్రెడీ విక్రమ్ తో శంకర్ తీసిన సూపర్ హిట్ ‘అపరిచితుడు’ రానే వచ్చేసింది. పైగా డిఐడి రావడానికి చూపిన కారణం కూడా తప్పుడు సమాచారమిచ్చేదిగా వుంది. ఈ కథలో చూపించినట్టు చిన్నప్పుడు ఏదైనా దారుణం కళ్ళారా చూస్తే (ఇక్కడ తల్లిదండ్రుల మరణం) ఈ మానసిక రుగ్మతకి లోనయ్యే సమస్యే లేదు. ఈ మానసిక రుగ్మత చిన్నతనంలో సుదీర్ఘకాలం పదేపదే లైంగిక హింసకి గురైతేనో, లేదా పెద్దల చేతిలో చిత్రహింసలకి గురైతేనో ఏర్పడుతుంది.

లాజిక్ లేకుండా ఈ రుగ్మతని పాత్రలకి ఆపాదించి అమాయక ప్రేక్షకుల్ని నమ్మించేద్దాం అనుకున్నట్టుంది. అలా నమ్మించాలన్నా ఈ రుగ్మతతో కథా నిర్వహణ కూడా కుదరలేదు. ఇటీవలే ‘సవ్యసాచి’ లో (ఇది కూడా మైత్రీ మూవీస్ తీసిందే) ఎడం చెయ్యి సమస్య అంటూ ఎలా అవకతవకగా చూపించారో ఇదీ అలాగే తయారయ్యింది. ఒక పాత రొటీన్ రివెంజి కథకి ఏదో రుగ్మత అంటూ బిల్డప్ ఇవ్వబోతే ఆ రుగ్మతా రివెంజీ రెండూ దారుణంగా విఫలమయ్యాయి. ఇందులో ప్రేక్షకులకి అపరిచితుడే కన్పిస్తే అది వాళ్ళ తప్పుకాదు.

ఎవరెలా చేశారు

రవితేజ తన బ్రాండ్ మ్యానరిజాలు, హీరోయిన్ వెంటబడి హెరాస్ చేయడాలూ వంటి వాటికి ఈసారి దూరంగా వుండడం రిలీఫే అయినా, డిఐడితో నటించిన అమర్- అక్బర్- అంటోనీ పాత్రల్లో పెప్ లేదు. రుగ్మత ప్రకారం ఒక పర్సనాలిటీ నుంచి ఇంకో పర్సనాలిటీకి మారిపోయే మానసిక సంచలనాలని పూర్తిగా డౌన్ ప్లే చేయడంతో చప్పగా వుంది. మానసిక సంచలనాలని ఎక్కువ చేసి చూపిస్తే ‘అపరిచితుడు’ అయిపోతుందని వెనుకాడినట్టుంది. కానీ పాత్ర చిత్రణకి కమర్షియల్ గా అపరిచితుడే కరెక్ట్. ఇకపోతే ఏ పాత్రకి కూడా కథతో ఎమోషనల్ కనెక్ట్ లేదు.

తల్లిదండ్రుల మరణానికి ఫీలవడంగానీ, ప్రతీకారానికి రగిలిపోవడంగానీ కన్పించవు. పైగా ఈ పాత్రలకి పదేపదే కమెడియన్లతో కథతో సంబంధం లేని కామెడీ ట్రాకులు అడ్డు పడుతూంటాయి. అలాగే ఇలియానాతో రోమాన్స్ కూడా ఉండలేదా అని గుర్తుచేసుకోవాల్సిన పరిస్థితి. రవితేజ మాస్ మహారాజా ఇమేజికి పాటలు కూడా సహకరించలేదు. రవితేజకి అన్ని ఆశలు పెట్టుకున్న ఈ మూడు ‘ఏ’ లు కూడా కలిసిరాలేదు.

ఇలియానా పాత్ర కూడా డిఐడి బాధిత పాత్రే. కానీ ఈమె మీద ఫోకస్ పెట్టలేదు. నామమాత్రంగా వుండిపోయే పాత్ర. ఇక కామెడీ బ్యాచి చేసే కామెడీ ఎవరికీ అర్ధమయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే అదంతా అమెరికాలో తెలుగు సంఘాల మీద సెటైర్. వాళ్ళ వ్యవహారమేమిటో, గోలేంటో రవితేజ మాస్ బేస్ కి తలకెక్కే అవకాశమే లేదు.

తమన్ సంగీతంలో పాటలు చాలా బలహీనం. పూర్తిగా అమెరికాలో తీసిన ఈ మూవీ ప్రొడక్షన్ విలువలు మాత్రం బావున్నాయి కెమెరా వర్క్ సహా. ఇక సంభాషణల్లో ఇంగ్లీషు పదాలు యదేచ్ఛగా వాడేశారు. ఇది కూడా రవితేజ సాధారణ ప్రేక్షకులకి అర్ధంగావు.

ఇక శ్రీనువైట్ల దర్శకత్వంలో మార్పేమీ రాలేదు. చాలా ఔట్ డేటెడ్ గా వుంది.

చివరికేమిటి

శ్రీనువైట్ల తన రొటీన్ టెంప్లెట్ నుంచి బయటికొచ్చి ఈ సినిమా చేశానని ఆశావహంగా చెప్పుకున్నారు గానీ అది ఆత్మవంచనే. ఆయన టెంప్లెట్ లోంచి బయటికి వచ్చింది నిజం, కానీ స్క్రీన్ ప్లేలోకి రాలేదు. ఆయన స్క్రీన్ ప్లేలోకి వచ్చినప్పుడే సక్సెస్ ని చవిచూస్తారు. ఈ స్క్రీన్ ప్లేలో కూర్చిన కథకి, పాత్రలకి ఓ దిశా దిక్కూ వున్నాయా? కలగూరగంపలా చేసి ఏదేమిటో అర్ధంగాకుండా చేశారు. పైగా ప్రారంభ సీను నుంచీ తల్లిదండ్రుల్ని చంపిన ఒక్క సీనునే సెకండాఫ్ దాకా ఫ్లాష్ బ్యాకులు వేసుకుంటూ పోయారు.

ప్రారంభంలోనే అర్ధమైపోయిన పాత రొటీన్ తల్లిదండ్రుల్ని చంపడమనే ఫార్ములా విషయాన్నే, ముక్కలు ముక్కలుగా పదేపదే ఫ్లాష్ బ్యాక్స్ తో వివరిస్తూ పోయారు. ఇలియానా కున్న రుగ్మత ఏమిటో ఇంటర్వెల్ కి ముందే చెప్పేసి కూడా, సెకండాఫ్ ఎత్తుకుని రవితేజకి వున్న అలాటి రుగ్మతే ఏమిటోరవితేజ తెలుసుకునే సీన్లతో సునీల్ కామెడీగా నడిపి బోరు కొట్టించారు. సినిమా మొత్తం మీద తేలిందేమిటంటే, సగభాగం దాకా అమెరికా సంఘాల పేరుతో కామెడీ, పావువంతు ఇలియానా రుగ్మత ఏమిటో చూపించడం, ఇంకో పావువంతు రవితేజకి అదే రుగ్మత ఏమిటో చెప్పుకుపోవడం, ఇవిపోగా మిగిలిన కొద్ది భాగం ప్రతీకార కథ నడపడం.

దీంతో మెయిన్ స్టోరీ మీద ఫోకస్ చెదిరి థ్రిల్, సస్పన్స్ అనేవి లేకుండా పోయాయి. ఈ మధ్య వచ్చిన హాలీవుడ్ ‘ఈక్వలైజర్ – 2’ లో మూడు ఉపకథలుంటాయి. అయినప్పటికీ కూడా ప్రధాన యాక్షన్ కథతో బాటు మూడు ఉపకథల్ని ఎలా మేనేజి చేసి హృదయరంజకం చేశారో చూస్తే శ్రీను వైట్ల దానిముందు వెలవెలబోతారు. ఏదో కొత్త పాయింటని చెప్పి తప్పుడు సమాచారంతో ప్రేక్షకుల అమాయత్వం మీద ప్లే చేయకుండా, నిజంగా ఆయనకి అర్ధవంతమైన కథలతో స్క్రీన్ ప్లేలోకి రావాలన్న సిన్సియారిటీ వుంటే తప్ప సక్సెస్ అందనంత దూరంలోనే వుండిపోతుంది.

రచన- దర్శకత్వం : శ్రీను వైట్ల 
తారాగణం : రవితేజ, ఇలియానా, సునీల్, వెన్నెల కిషోర్, సత్య, సాయాజీ షిండే, జయప్రకాష్ రెడ్డి, అభిమన్యు సింగ్, విక్రం జిత్ విర్క్ తదితరులు 
సంగీతం : తమన్, ఛాయగ్రహణం : వెంకట్ సి దిలీప్
బ్యానర్ : మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు : నవీన్, రవి, మోహన్, ప్రవీణ్