టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) అభిమానులకు అనుకోని షాక్ తగిలింది. ఈ నెలలో విశాఖపట్నం విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్‌లో నిర్వహించాల్సిన డీఎస్పీ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. భద్రతా కారణాలు చూపుతూ సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. దీంతో ఈ ఈవెంట్ జరగదన్న విషయం ఖరారైంది.
ఇటీవలి అదే వేదికలోని వాటర్ వల్డ్‌లో ఓ బాలుడు మునిగి చనిపోయిన సంఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై అధికారులు సీరియస్‌గా స్పందించారు. అదే ప్రాంతంలో మళ్లీ పెద్ద ఈవెంట్‌కు అనుమతి ఇవ్వడం కరెక్ట్ కాదన్న అభిప్రాయంతోనే డీఎస్పీ కాన్సర్ట్‌కి నో చెప్పారు. భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం, సంగీత ప్రియులకి మాత్రం నిరాశను తెచ్చిపెట్టింది.
ఈ కాన్సర్ట్ కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. నిర్వాహకులు భారీగా ఆన్‌లైన్ టికెట్లు అమ్మారు. సోషల్ మీడియాలో ప్రమోషన్ కూడా జోరుగా జరిగింది. కానీ చివరి నిమిషంలో అనుమతి లభించకపోవడంతో, షోను చూసేందుకు టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులు కూడా గందరగోళానికి గురవుతున్నారు. డీఎస్పీ టీమ్‌కు కూడా ఇది పెద్ద ఊహించని ఎదురుదెబ్బ అని చెప్పాలి.
ఇప్పటికి ఈ కాన్సర్ట్ వాయిదా వేస్తారా? లేక వేరే ప్రదేశంలో నిర్వహిస్తారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసిన వారికి రీఫండ్ ఇస్తారా? లేక కొత్త తేదీ ప్రకటిస్తారా? అన్నది నిర్వాహకుల ప్రకటనపై ఆధారపడి ఉంటుంది.

