రెండున్నర గంటల భస్మాసుర హస్తం! (‘స‌వ్య‌సాచి’ రివ్యూ)

 —-సికిందర్

ఈ తరం యువ స్టార్ నాగచైతన్య పాతతరం ‘శైలజా రెడ్డి అల్లుడు’ అనే రాతియుగం మూసతో నిరాశపర్చాక, తీవ్ర ఆసక్తి రేపుతూ ‘సవ్యసాచి’ అనే కొత్త ప్రయత్నాన్ని దీపావళి కానుకగా తీసుకు వచ్చాడు. తనకి హిట్ అనేది అందని మాని పండు అయిపోయాక దాని కోసం హడావిడీ చేస్తూ కొత్తదనాన్ని మోసుకొస్తున్నట్టు వైబ్రెంట్ గా వార్తల్లో నిలిచాడు. తెలుగులో తొలిసారి ఆర్బాటంగా వానిషింగ్ ట్విన్ సిండ్రోం అనే అరుదైన శారీరక స్థితిని కథగా చేసుకుని, తనకి ‘ప్రేమమ్’ అనే హిట్ ఇచ్చిన చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ గా ప్రత్యక్షమయ్యాడు. ఏవో శారీరక స్థితుల పేర్లు చెప్పుకుని బిల్డప్ ఇస్తూ ఈ మధ్య కొన్ని సినిమాలొచ్చాయి. ‘పోర్ఫీరియా’ అని నిఖిల్ తో ‘సూర్య వర్సెస్ సూర్య’, ‘ఓసిడి’ అంటూ శర్వానంద్ తో ‘మహానుభావుడు’ వంటివి. ఈ సైంటిఫిక్ పేర్లకీ తీసిన సినిమాలకీ సంబంధం లేకుండా వూరికే బిల్డప్ ఇస్తూ. ‘సవ్యసాచి’ కూడా ఈ కోవకే చెందుతుందా? పబ్లిసిటీ చేసుకున్నంత బలంగా వానిషింగ్ ట్విన్ సిండ్రోంని ఇందులో చూపించారా? నేటి యువదర్శకులు కూడా స్టార్లతో పాత మూస ఫార్ములా రివెంజులే తీసే దురదృష్టానికి తమ టాలెంట్స్ ని తాకట్టు పెట్టాక, ‘సవ్యసాచి’ ఎంత సవ్యంగా వుందో ఓసారి చూద్దాం…

కథ

హిమాచల్ ప్రదేశ్ లోని కులూ మనాలీలో బస్సు ప్రమాదంలో విక్రమాదిత్య (నాగ చైతన్య) ఒక్కడే బతికి బయట పడతాడు. అతను హైదరాబాద్ లో అక్క శ్రీదేవి (భూమిక) ఇంట్లో వుంటాడు. అక్క కూతురు మహా అంటే చాలా ఇష్టం. అతడికో సమస్య వుంటుంది. సంతోష మేసినా, కోపమొచ్చినా ఎడం చెయ్యి అతడి కంట్రోల్లో వుండక రియాక్ట్ అవుతుంది. చిన్నప్పుడు డాక్టర్ (రావు రమేష్) కి చూపిస్తే, ఇది వానిషింగ్ ట్విన్ సిండ్రోం అని వివరిస్తాడు. అంటే పుట్టినప్పుడే అతడిలో కవల సోదరుడు వుండి ఎడమ చేయి ద్వారా ఫీలింగ్స్ ప్రకటిస్తున్నాడని చెప్తాడు. అందుకని అతడి తల్లి విక్రం, ఆదిత్య అని రెండు పేర్లు పెట్టుకుని పిలుస్తుంది.
యాడ్ ఫిలిం మేకర్ అయిన విక్రం ఓ యాడ్ ఫిలిం పనిమీద చిత్ర (నిధీ అగర్వాల్) ని కలిసినప్పుడు కంగారు పడతాడు. ఆమెని ఆరేళ్ళ క్రితం ప్రేమించి చెప్పకుండా మాయమైపోయాడు. ఇప్పుడు చూసి తనెందుకు వెళ్ళిపోవాల్సి వచ్చిందో కారణం చెప్పేసరికి ఆమె ప్రేమించడం మొదలెడుతుంది. ఇంతలో అక్క వుంటున్న ఇల్లు బాంబు పేలి బావ చనిపోతాడు, అక్క హాస్పిటల్లో చేరుతుంది, అక్క కూతురు కిడ్నాప్ అవుతుంది. కిడ్నాప్ చేసింది అరుణ్ (మాధవన్) అనే సైకో. ఎందుకు కిడ్నాప్ చేశాడు, హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన బస్సు ప్రమాదంతో ఇతడికేమిటి సంబంధం అన్నవి మిగతా కథ.

 

ఎలావుంది కథ
వానిషింగ్ ట్విన్ సిండ్రోం అనే మెడికల్ స్థితి ఆధారంగా ఈ కథ తయారు చేశామని చెప్పుకున్నారు. గర్భంలో పిండ దశలో వున్న కవలల్లో ఒక పిండం గర్భ విచ్చిత్తికి లోనైనప్పుడు, దాని కణజాలాన్ని రెండో పిండం శోషించుకునే అరుదైన స్థితి ఇది. అలా పుట్టిన ఒకే బిడ్డ తనలో రెండో బిడ్డని కలుపుకుని పుడుతుంది. ఈ సిండ్రోంతో 2000 లో ‘వానిషింగ్ ట్విన్’ అనే అద్భుత కొరియన్ సినిమా వచ్చింది. ఇది హీరోయిన్ పాత్ర మీద వుంటుంది. ఈ సిండ్రోం కాకుండా ఏలియన్ హేండ్ సిండ్రోం అని మరొక మెడికల్ స్థితి వుంది. ఇది మెదడులో లోపం వల్ల ఏర్పడుతుంది. దీని మీద చాలా సినిమాలు వచ్చాయి.1964 లోనే స్టాన్లీ క్యూబ్రిక్ ‘డాక్టర్ స్ట్రేంజి లవ్’ తీశాడు. ఇందులో హీరో పీటర్ సెల్లర్ కి ఎడం చెయ్యి మాట వినదు.1999 లో ‘ఐడిల్ హేండ్స్’ అనే హార్రర్ కామెడీ వచ్చింది. ఇంకా అనేక టీవీ సీరియల్స్ వచ్చాయి. తమిళంలో 2017 లో ‘పీచన్కాయ్’, 2016 లో కన్నడలో ‘సంకష్ట కర గణపతి’ కూడా వచ్చేశాయి. సినిమాగా చూస్తే రెండు స్థితులకి తేడా కన్పించదు – ఒక్క మొదటి దాని విషయంలో తనలో కవల సోదరుడు లేదా సోదరి వున్న ఫీలింగ్ తప్పితే. రెండు స్థితులూ ఎడం చేతి వాటాన్నే కలిగి వుంటాయి. ‘సవ్యసాచి’ లో నిక్షిప్త కవలని సోదరుడుగా చెప్పడం ఒక్కటే ఇల్లాజికల్ గా వుంటుంది. ఆ పిండం కచ్చితంగా మగే అని ఎలా తెలుసు? నీ బ్రదర్, నీ బ్రదర్ అని పదేపదే గుర్తు చేస్తూంటారు. సిస్టర్ ఎందుకు కాకూడదు? తనని గుర్తించకుండా బ్రదర్ అంటున్నందుకే ఆమె అలా రియాక్ట్ అవుతోందేమో. ఆ కోపం కొద్దీ కథని కుదరనీయక అపసవ్య, అపహాస్య, అపభ్రంశ చేసిందేమో? అసలు సినిమా ప్రారంభమే టైటిల్స్ తో భస్మాసుర హస్తం కథ ఇందుకే చేరిపోయిందేమో?

ఎవరెలా చేశారు
ఎడం చేయి ఈ కథకి హీరో అవ్వాలి. పైన చెప్పుకున్న కారణాల వల్ల కాలేదు. ఇక నాగచైతన్య ఎక్కువ కష్టపడకుండా పైపైన నటించేశాడు. ఎడం చేయి వరకే అతడి భావోద్వేగాలు – మిగతా శరీరంలో- మనస్సులో- తనలో ఇంకో ప్రాణివుందన్న ఫీలింగ్సే లేని అసమగ్ర, కృత్రిమ పాత్ర చిత్రణ తనది. ఇంతేకాదు పాసివ్ పాత్రకూడా. ఈ బలహీనమైన పాసివ్ పాత్ర వల్ల అసలు విలన్ వల్ల తనకేం జరుగుతోందో తెలీని అమాయకత్వంతో, విలన్ చేతిలో కీలు బొమ్మయి పోయాడు చివరిదాకా. పాటలకి డాన్సు బాగా చేశాడు. కొన్ని ఫైట్లు బాగా చేశాడు.

హీరోయిన్ నిధీ అగర్వాల్ ఫస్టాఫ్ ప్రేమ వరకే పరిమితం. సెకండాఫ్ హీరోకి సానుభూతి ప్రకటిస్తూ వెంట వుండడమే. అసలిది ఎడం చెయ్యి కథ కాదు, నాగచైతన్య పాత్ర కథా కాదు – బలమైన మాధవన్ సైకో విలన్ పాత్ర కథ! సినిమా మొత్తం మీద అతనొక్కడే సీన్లని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఇక విలన్ ఎందుకిదంతా చేస్తున్నాడో చివరికి చెప్పేసరికి ఆ విషయమంతా మరొక నాన్సెన్స్.

వెన్నెల కోశోర్, షకలక శంకర్, ప్రవీణ్ లు రొటీన్ కామెడీలే చేశారు. కీరవాణి సంగీతం ఓ మాదిరిగా వుంది. యువరాజ్ ఛాయగ్రహణానికి ప్రొడక్షన్ విలువలు ఖరీడైనవిగా వున్నాయి. ఈ తరం దర్శకుడుగా చందూ మొండేటి కొత్తగా తీసిందేమీ లేదు. ఇలాటి పాత చింతకాయ మూస ఫార్ములా రివెంజి సినిమాలు చాలా వచ్చాయి. ప్రేక్షకులు థ్రిల్ ఫీలవడం లేదు.

చివరికేమిటి
ఈ వారం కూడా ఇంకా ఫ్లాపయ్యే ఎండ్ సస్పెన్స్ కథతో, పాసివ్ పాత్రతో సినిమా వచ్చినందుకు ఆశ్చర్యపోనవసరం లేదు. అసలు ఎండ్ సస్పెన్స్ అంటే ఏమిటో, పాసివ్ పాత్రంటే ఏమిటో తెలిస్తే కదా ఇలాటివి తీయకుండా జాగ్రత్త పడడానికి. గతవారం ‘వీరభోగ వసంత రాయలు’ ఇలాంటిదే. అసలీ సినిమా కథేమిటో చిట్టచివర క్లయిమాక్స్ దాకా, అదీ సైకో విలన్ చెప్పేదాకా తెలీదు. సోది ఆపి పాయింటు చెప్పరా నాయనా అని ట్విట్టర్ లో ఒక ప్రేక్షకుడు కామెంట్ పెట్టాడంటే, ప్రేక్షకుల కున్న కామన్ సెన్స్ దీని మేకర్ కి లేదు.
ఇంకోటేమిటంటే ఇది ఫ్లాప్స్ కి దారితీస్తున్న టెంప్లెట్ స్క్రీన్ ప్లే కూడా. అంటే ఫస్టాఫ్ లో నడిపే ప్రేమ కథ అసలు కథ కాదు, ఇంటర్వెల్లో విలన్ తో మొదలయ్యేదే అసలు కథ. ఇంటర్వెల్లో మొదలయ్యే అసలు కథకోసం ప్రేక్షకులు అంతవరకూ సినిమాలో ఆతర్వాత వుందని ప్రేమ కథని భరించాలన్న మాట. ఇక్కడ ఫస్టాఫ్ గంటంపావు కాలేజీ ప్రేమ కథ కూడా చాలా బోరుగా వుంది. మొదటే చెప్పుకున్నట్టు, తెలుగులో వానిషింగ్ ట్విన్ సిండ్రోంతో సినిమా అని గొప్పగా చెప్పుకోవడం ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించే బిల్డప్పే!

 

Rating: 2