నీతులు, సూక్తులు, ఫిలాసఫీలు టూ మచ్ యార్: చిత్రలహరి (మూవీ రివ్యూ)

‘చిత్రలహరి’ 
రచన దర్శకత్వం : కిషోర్ తిరుమల 
తారాగణం : సాయి ధరమ్ తేజ్, కళ్యాణీ ప్రియదర్శిని, నివేదా పేతురాజ్, పోసాని, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సంగీతం : దేవీశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : కార్తీక్ ఘట్టమనేని 
బ్యానర్ : మైత్రీ మూవీ మేకర్స్ 
విడుదల : ఏప్రెల్ 12 2019 

2/5

        ఆరువరస ఫ్లాపుల హీరో సాయి ధరమ్ తేజ్ పేరు మార్చుకుంటే అదృష్టం కలిసి వస్తుందని సాయి తేజ్ గా ఎడిట్ చేసుకుని ఫ్రెషప్  అయ్యాడు. నిజానికి ధరమ్, తేజ్ హిందీ పదాలు. సాయి ధర్మ తేజ అని ముందు నుంచే  తెలుగు పేరుంటే అదృష్టం ఎప్పుడో వరించేదేమో. ఇప్పుడు కూడా సాయి పక్కన ‘తేజ్’ వుంది. అంటే ఇంకా దురదృష్టం మిగిలి వున్నట్టేనా? అంతే నన్పిస్తుంది ‘చిత్రలహరి’ కూడా చూస్తే.  పైగా శుభమా అంటూ అదృష్టం కోసం పేరు మార్చుకుని, దురదృష్టం వెంటాడే పాత్రే వేశాడు! అదృష్టాన్ని పేర్లు తెచ్చిపెడతాయా, చేసే సినిమాల్లో ‘విషయం’ తెచ్చిపెడుతుందా? 

        నేనూ శైలజ, ఉన్నది ఒకటే జీవితం, సెకండ్ హేండ్ లాంటి యావరేజి సెంటిమెంటల్ డ్రామాలు తీసిన కిషోర్ తిరుమల ‘చిత్రలహరి’ అనే వైబ్రెంట్ టైటిల్ తో ఎలాటి సినిమా తీశాడు? అలాగే శ్రీమంతుడు, జనతా గ్యారేజి, రంగస్థలం అనే మూడు వరస హిట్లు తీసి, సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంథోనీ అనే రెండు వరస ఫ్లాపులతో ఆశ్చర్య పర్చిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సారి దారిలో పడ్డారా? ఇవన్నీ తెలుసుకునేందుకు రివ్యూలో కెళ్దాం…

 

కథ 

        విజయ్ (సాయి ధరమ్ తేజ్) ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్. అతనొక ప్రమాదాల్లో ఆదుకునే పరికరాన్ని రూపొందిస్తాడు. దాన్నికంపెనీలకి అమ్మాలని ప్రయత్నిస్తాడు. ఆ అతడికి ఒక ఫ్రెండ్ స్వేచ్ఛ (నివేదా పేతురాజ్) సహాయపడుతూంటుంది. ఈమె ఫ్రెండ్ లహరి (కళ్యాణీ ప్రియదర్శిని) విజయ్ ని ప్రేమిస్తూంటుంది. అయితే విజయ్ పైకి తన ప్రాజెక్ట్స్ గురించి చెప్తున్నా అతను ఒక టీవీ రిపేర్ సెంటర్లో పనిచేస్తున్నాడని తెలుసుకుని తడికి బ్రేకప్ చెప్పెస్తున్న్ది. ఇంకోవైపు విజయ్ పరికరాన్ని స్పాన్సర్ చేయకుండా పేటెంట్ హక్కులు అడిగిన కంపెనీ అధినేత (బ్రహ్మాజీ) కి ఎదురు తిరిగి చాలెంజి చేసి వెళ్ళిపోతాడు విజయ్. ఇప్పుడు పరికరంతో సక్సెస్ కాలేక, మరోవైపు ప్రేమ విఫలమైన విజయ్ ఏం చేశాడనేది మిగతా కథ.

 

ఎలావుంది కథ 

        ఆత్మ విశ్వాసముంటే ఏదైనా సాధించగలరని యూత్ కి సందేశ మిచ్చే రొటీన్ కథ. సందేశాన్ని సందేహించేలాగా నడిచే కథ. ఆత్మవిశ్వాసంతో పరాధీనతనే కోరుకునే కథ. తను కనుగొన్న పరికరాన్ని ప్రభుత్వ సహాయంతో స్టార్టప్ కంపెనీ పెట్టుకుని ఎంటర్ ప్రెన్యూర్ అవచ్చని నడుస్తున్న ట్రెండ్ గురించి చెప్పని కథ. ప్రాక్టికాలిటీని మరిచిన కథ. ఎంతసేపూ తన పరికరాన్ని ఎవరో వచ్చి స్పాన్సర్  చేయాలన్న  స్వావలంబన స్పృహ లేని కథ. ఇలా స్పాన్సర్ చేసేందుకు పరికర సామర్ధ్యాన్ని నిరూపించే ప్రయోగం తనమీదే చేసుకుని ప్రాణాల మీదికి తెచ్చుకుని చట్టానికి చిక్కే కథ. చివరికి ఆ పెట్టుబడిదారు విశ్వాసాన్ని చూరగొని పరికరాన్ని సమర్పించుకునే బానిస మనస్తత్వపు కథ. రాంగ్ మెసేజి నిచ్చే అవాస్తవిక కథ.

ఎవరెలా చేశారు

        సాయి తేజ్ బాగా చేశాడు. సినిమాలో ఏదీ బ్రహ్మాండంగా లేకపోయిన్నా బాగా చేశాడు. గత సినిమాలలోని మాస్ హీరోయిజం లేదు. ఫుల్ గడ్డంతో లుక్ మార్చుకుని గడ్డ పూర్వకంగా ఒద్దికగా నటించాడు. నటనలో ఇంప్రూవయాడు గానీ పాత్రే బలహీనం. చిన్నపట్నుంచీ ఏది చేయబోయినా సక్సెస్ కాలేని పరాజితుడని- అతనొక ఫెయిల్యూర్ కాండిడేట్ అనీ మాటల్లో చెప్పడమే గానీ ఎక్కడా చూపించలేదు. కేవలం ఆ పరికరం గురించే ఫెయిలవుతున్నట్టు చూపించారు. దీంతో ఇది పైపైన రాసేసి పైపైన సినిమాలు తీ సేస్తున్న కేటగిరీలో చేరింది. ఫెయిల్యూర్ అనడమేగానీ అందుకు ఫెయిలవుతున్నాడో ఆత్మ పరిశీలనలేని పాత్ర చిత్రణ. ఎన్నో కొత్త పరికరాలు కనుగొన్నాడు గానీ అదృష్టం కలిసి రావడం లేదని గగ్గోలు. శుభ్రంగా ఇలాటి వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్టార్టప్ ఇండియా స్కీములో చేరిపోతే శని అంతా వదిలిపోతుంది. ఏ కాలంలో వున్నాడో ఇలాటి కథ, పాత్ర పట్టుకుని కథకుడు / దర్శకుడు. 

        సినిమాలో స్పీడు లేకపోవడం సాయి తేజ్ కి ఇంకో స్పీడ్ బ్రేకర్. మొదటి ఇంట్రో పాట చాలా బలహీనంగా వుంది. హీరోయిన్ తో రోమాన్సులో విషయం కూడా తక్కువే. కానీ ఇంటర్వెల్ బ్రేకప్ సీను దర్శకుడు బాగా హేండిల్ చేయడం వల్ల, దెబ్బ తిన్న లవర్ గా  అక్కడ బెటర్ అన్పించుకుంటాడు తేజ్. కానీ మెయిన్ స్టోరీ పరికరం విషయంలో సరైన వ్యూహంలేక, ఫస్టాఫ్ నుంచీ మొత్తం  సెకండాఫ్ అంతా బోరు కొట్టిస్తాడు. హీరోగా సాయి తేజ్ విజయం కోసం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి వుంది. ఈ కథ తన నట జీవితానికి దగ్గరగా వుందని ఫీలై ఒప్పుకున్నట్టు చెప్పాడు. ఫెయిల్యూర్స్ గురించి చెప్పే ఈ కథతో ఇంకెందుకు తన జీవితంలోకి నెగెటివిజాన్ని ఆకర్షించడం?

        హీరోయిన్ లిద్దరూ అంతంత మాత్రం. పాత్రలకి యూత్ అప్పీల్ లేదు. చెప్పే డైలాగుల్లో జీవితం గురించి భారీ కొటేషన్ లుంటాయి. యూత్ ఫుల్ క్యారక్టర్స్ గా లేవు. ఫస్ట్ హీరోయిన్ కళ్యాణీ ప్రియదర్శిని పాటల్లో తప్ప ఎక్కడా హుషారుగా కన్పించడుదు.

        ఇక హీరో తండ్రిగా పోసానీ షరా మామూలు పాత్ర. హీరో ఫ్రెండ్ గా క్రైస్తవ గీతాలు పాడే సింగర్ గా సునీల్ నవ్వించే పాత్ర కాదు. సెకండాఫ్ లో వచ్చే వెన్నెల కిషోర్ నవ్వించాడని విశ్వ ప్రయత్నం చేస్తాడు. 

        దేవీశ్రీ ప్రసాద్ సంగీతం యావరేజిగా వుంది. ముఖ్యంగా హీరో ఎంట్రీ సాంగ్ సినిమా పారంభాన్నే దెబ్బ తీసేంత బీట్ లెస్ గా వుంది. సాయితేజ్ గత మాస్ సినిమాల్లో వూపేసే ఎంట్రీ సాంగ్స్ వున్నాయి. కార్తీక్ ఘట్టమనేని కెమెరా వర్క్ నీటుగా వుంది.

చివరికేమిటి  

 

        యూత్ కేదో మెసేజి ఇవ్వాలనుకోవడం పాత కాలం నాటి విషయం. ఇవ్వాళ్ళ మెసేజి కాదు, ఏం చేయ్యాలో ప్రాక్టికల్ గా చూపించాలి. మార్కెట్ యాస్పెక్ట్ పరంగా ఇది కెరీర్ కోసం, ఉపాధికోసం స్ట్రగుల్ చేసే ఎకనమిక్స్ కాన్సెప్ట్ కథ. ఇదే ఎకనమిక్స్ యాస్పెక్ట్ తో ఇటీవల ‘హుషారు’ అనే చిన్న సినిమా కొత్త వాళ్లతో ఎంత హిట్టయిందో తెలిసిందే. అదే పనిగా రోమాంటిక్స్ తో వస్తున్న సినిమాలతో విసిగిపోయిన యువప్రేక్షకులు, ఫ్రెష్ గా ఎకనామిక్స్ తో రావడంతో  ‘హుషారు’ ని  అంతలా ఓన్ చేసుకున్నారు. ఈ మార్కెట్ యాస్పెక్ట్ వ్యూహం బొత్తిగా లోపించింది ‘చిత్రలహరి’ లో రొటీన్ గా బేస్, డెప్త్ వుందని మూసా ఫార్ములా తీసేస్తే పెద్ద హీరో లాక్కుపోతాడనుకున్నట్టుంది. ఇది వర్కౌట్ కాలేదు. పైగా విషయం భారంగా, ఎంటర్టయిన్ మెంట్ లేకుండా వుంది. ‘హుషారు’ ఎకనమిక్స్ మూవీలో వున్న కామెడీలో పావు వంతు కూడా లేదు. నీతులు, సూక్తులు, ఫిలాసఫీలు చెప్పడం ఎక్కువై పోయింది. కమర్షియల్ సినిమా లక్షణాలకి దూరంగా మిగిలిపోయిది…

―సికిందర్