కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు చేశారు. సీఎం కేసీఆర్ దేశమంతా తిరిగి వైసిపి మద్దతు తప్ప ఇంకో పార్టీ మద్దతు కూడగట్టుకోలేకపోయారని ఆమె విమర్శించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే…

“సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశమంతా తిరిగారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి, డిఎంకే అధినేత స్టాలిన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ లను కలిశారు. మరికొంత మందిని కూడా కలిసే ప్రయత్నం చేశారు. కానీ బిజెపికి వ్యతిరేకంగా కోల్ కత్తాలో జరిగిన మహాకూటమి సభలో వీరంతా పాల్గొన్నారు. టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పడబోయే ఫెడరల్ ఫ్రంట్ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమవుతుంది.

తెలంగాణలో చేసినట్టుగా దేశంలోనూ రాజకీయాలు చేయాలని కేసీఆర్ చూశారు. కానీ అది సాగదని అర్ధం అయ్యే సరికి నిశ్శబ్దమయ్యారు. ప్రధాన పార్టీల మద్దతు లేకుండా ఏర్పడబోయే కూటమిని ఫెడరల్ ఫ్రంట్ అనే బదులు ఫెడ్ అప్ ఫ్రంట్ అని అనడం మంచిది. వైసిపి మద్దతు తప్ప కేసీఆర్ సాధించింది ఏం లేదు” అని విజయశాంతి విమర్శించారు.