కొన్ని మీడియా సంస్థ‌ల‌కు క‌నీస జ్ఞానం కూడా ఉండ‌ట్లేదు: కేటీఆర్‌

ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్ రాసిన క‌థ‌నం టీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్యక్షుడు కేటీఆర్‌కు ఆగ్ర‌హాన్ని తెప్పించింది. ఆయ‌నకు కోపం న‌షాళానికి అంటింది. కొన్ని మీడియా సంస్థ‌ల‌కు క‌నీస ఇంగిత‌జ్ఞానం ఉండ‌ట్లేదంటూ చుర‌క‌లు అంటించారు. ఓ వార్తని ప‌బ్లిష్ చేసే ముందు- అదెంత వ‌ర‌కు వాస్త‌వం అనే విష‌యాన్ని కూడా తెలుసుకోలేక‌పోతున్నాయ‌ని అన్నారు.

ఆ ఇంగ్లీష్ వెబ్‌సైట్ రాసిన క‌థ‌నం ఏమిటంటే- తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విని అధిష్ఠించాల‌నే ఏకైక ఉద్దేశంతోనే మ‌హాచండి యాగాన్ని నిర్వ‌హిస్తున్నారని. కోల్‌క‌త‌లో జ‌రిగిన యునైటెడ్ ఇండియా ర్యాలీకి డుమ్మా కొట్టిన కేసీఆర్ య‌జ్ఞ‌, యాగాల మీద దృష్టి పెట్టార‌ని, ఒకేరోజు మూడు యాగాల‌ను నిర్వ‌హిస్తున్నార‌ని రాసింది.

వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించి, ప్ర‌ధాన‌మంత్రి కావాల‌ని కేసీఆర్ ఆశిస్తున్నార‌ని పేర్కొంది. య‌జ్ఞం చేయ‌డానికి వార‌ణాశి నుంచి రుత్విక్కుల‌ను కూడా పిలిపించిందంటూ ఓ క‌థ‌నాన్ని రాసింది. చండీ దేవిని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి స‌హ‌స్ర చండి మ‌హాయాగం, రుద్ర మ‌హాయాగం, చ‌తుర్వేద య‌జ్ఞాల‌ను నిర్వ‌హిస్తున్నార‌ని పేర్కొంది.

ఈ యాగానికి నేతృత్వం వ‌హిస్తున్న మాణిక్య సోమ‌యాజులు పేరును ఉటంకిస్తూ, కేసీఆర్‌కు ఉన్న జ‌నాద‌ర‌ణ‌ను ఈ యాగం మ‌రింత బ‌లోపేతం చేస్తుంద‌ని, రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల మ‌న‌స్సు మార్చుతుంద‌ని రాసింది. `ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌ధాని కావాల‌ని కోరుకుంటార‌ని, ఈ యాగం ద్వారా చండీదేవిని ప్ర‌స‌న్నం చేసుకుని కేసీఆర్ త‌ప్ప‌కుండా ప్ర‌ధాని అవుతారు.`

అని సోమ‌యాజులు త‌మ ప్ర‌తినిధికి వివ‌రించిన‌ట్లు ఆ ఇంగ్లీష్ వెబ్‌సైట్ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఈ క‌థ‌నాన్ని కేటీఆర్ అభిమాని ఒక‌రు..ఆయ‌న‌కు ట్వీట్ చేశారు. దీనిపై స్పందించాల్సిందిగా కోరారు. ఈ క‌థ‌నం కాస్తా కేటీఆర్‌కు ఆగ్ర‌హాన్ని తెప్పించింది. ఇలాంటి మీడియా సంస్థ‌కు బేసిక్స్ కూడా తెలియవ‌ని విమ‌ర్శించారు.