కాంగ్రెస్ ఆఫర్ ను పొలైట్ గా రిజెక్ట్ చేసిన కోదండరాం

‘ముష్టి మూడు సీట్ల కోసం కోదండరాం కాంగ్రెస్ పార్టీ తోక పట్టుకుని తిరుగుతున్నడు’ ఈ పంచ్ డైలాగ్ పేల్చింది ఎవరో కాదు కేసిఆర్ కొడుకు, మంత్రి కేటిఆర్. మహా కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో వ్యవహరిస్తున్న తీరుపై కేటిఆర్ ఇలా కార్నర్ చేసి విమర్శలు చేశారు. అప్పటి వరకు తెలంగాణ జన సమితికి కూటమిలో మూడే సీట్లు ఇవ్వబోతున్నట్లు కాంగ్రెస్ పెద్దలు లీకులు ఇచ్చారు.

దీంతో కాంగ్రెస్ కు కోదండరాం పార్టీపై చిన్నచూపు ఉన్నట్లు చర్చ మొదలైంది. దానికి కౌంటర్ గా కోదండరాం కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యారు. అవసరమైతే కాంగ్రెస్ కూటమికి విడాకులు ఇస్తామన్న ధోరలో కౌంటర్ ఇచ్చారు. దీంతో మూడు సీట్లు వివాదం సద్దుమణిగింది. ఇదంతా గతం. మరి ఇప్పుడు కోదండరాం కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చని ఆఫర్ ఏంటి? ఆయన ఎందుకు రిజెక్ట్ చేశారు. ఆ ముచ్చటేందో ఒకసారి చదవండి.

ఒకవైపు మహా కూటమి సీట్ల పంపకాలపై చర్చలు చేస్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఫీల్డులో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఏకంగా పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేత ప్రచారం కూడా షురూ చేయిస్తున్నది. శనివారం తెలంగాణలోని భైంసా, కామారెడ్డి, చార్మినార్ లలో రాహుల్ టూర్ ఖరారు చేసింది. భారీ సభలతో ప్రచారాన్ని హోరెత్తించనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ సభలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బహిరంగసభల్లో పాల్గొనాలంటూ కూటమి పార్టీలను ఆహ్వానించింది. అంతేకాదు రాహుల్ సభలో తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం కూడా హాజరవుతున్నట్లు ఒక ఫీలర్ మీడియాకు వదిలింది. ఫీలర్ వదలడమే కాదు రాహుల్ సభకు రావాలంటూ కోదండరాం ను రిక్వెస్ట్ చేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ ఇచ్చిన ఆ ఆఫర్ ను కోదండరాం సున్నితంగానే తిరస్కరించారు. సీట్ల సంఖ్య తేలకముందే కాంగ్రెస్ సభల్లో వేదికలు పంచుకునేది లేదని తేల్చి చెప్పారు. సీట్ల సంఖ్య తేల్చిన తర్వాతే ఉమ్మడి వేదిక మీదికి తాము వస్తామని స్పష్టం చేశారు.

కోదండరాం ఈ స్టెప్ వేయడాన్ని జన సమితి నేతలు స్వాగతిస్తున్నారు. సీట్ల పంపకాలపై కాంగ్రెస్ పార్టీ తేల్చకపోవడంతో భాగస్వామ్య పక్షాలైన జన సమితి, సిపిఐ, టిడిపి కూడా పెద్దన్న కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉన్నాయి. కోదండరాం ఈ స్టెప్ తీసుకోవడంలో ఆంతర్యం ఏమై ఉంటుందన్న చర్చ జరుగుతున్నది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీతో అంటకాగేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే నష్టం జరుగుతుందన్న ఆందోళనలో జన సమితి ఉన్నట్లు తెలుస్తోంది. పొత్తు కుదరకపోతే ఈ క్షణమైనా గుడ్ బై చెప్పి తమ దారి తాము చూసుకుంటామన్న స్ట్రాంగ్ ఇండికేషన్ ఈ హెచ్చరికలో కాంగ్రెస్ కు పంపినట్లు జన సమితి నేతలు చెబుతున్నారు.

రాహుల్ సభలలో తమను పాల్గొనాలని కాంగ్రెస్ కోరిన మాట వాస్తవమేనని, కానీ తాము రాహుల్ సభలో పాల్గొనడంలేదని మీడియా ముందు క్లియర్ గా చెప్పారు కోదండరాం. సీట్ల సంఖ్యపై కాంగ్రెస్, జన సమితి మధ్య ఇంకా చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపించడంలేదు. జన సమితి కోరిన సీట్లకు, కాంగ్రెస్ ఇస్తామన్న సీట్లకు మధ్య భారీ తేడా కనబడుతున్నది. దీంతో జన సమితి ఆచి తూచి అడుగులు వేస్తున్నది.

జన సమితి గుర్తు పైనే పోటీ

సీట్ల సంఖ్య తేల్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త ప్రతిపాదనను జన సమితి ముందుకు తెచ్చింది. అదేమంటే 9 సీట్లు మాత్రమే జన సమితికి ఇస్తాం.. అంతకంటే ఎక్కువగా సీట్లు కావాలంటే జనసమితి అభ్యర్థులను కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేయించాలి. ఈ ప్రతిపాదనను కోదండరాం మొహమాటం లేకుండా రిజెక్ట్ చేశారు. తమ పార్టీ అభ్యర్థులు తమ గుర్తుపై కాకుండా కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేయబోతున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని మీడియా ముందు చెప్పేశారు. తమ పార్టీ అభ్యర్థులంతా తమ గుర్తు మీదనే పోటీ చేస్తారని, ఇందులో ఎలాంటి చర్చ లేదని తేల్చి చెప్పారు.

తెలంగాణ జన సమితి తొలుతు 36 సీట్లు కావాలని నివేదికను కాంగ్రెస్ పార్టీకి అందజేసింది. ఆ నివేదిక అందిన సమయంలోనే 3 సీట్లు అంటూ కాంగ్రెస్ లీకులు ఇచ్చింది. అయితే జన సమితి రోజుకో మెట్టు దిగుతూ ఉన్నది. తెలంగాణలో నిరంకుశ కుటుంబ పాలన అంతం చేయడానికే తాము కూటమి కట్టామని, అవసరమైతే ఒక మెట్లు దిగడానికైనా అభ్యంతరం లేదని కోదండరాం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 36 సీట్ల నుంచి ఒక దశలో 20 సీట్లకు దిగొచ్చింది జన సమితి. అయినా కాంగ్రెస్ ఇంకా కిందికి గుంజుతూనే ఉన్నది.

ఇక రెండో దశలో జన సమితి కచ్చితంగా 15 సీట్ల నుంచి 17కు తగ్గేది లేదని తేల్చింది. అయితే కాంగ్రెస్ 9 సీట్ల ఆఫర్ చేసింది. ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మధ్యే మార్గంగా 12 లేదా 13 సీట్లతో మ్యాటర్ సెటిల్ కావొచ్చని అంటున్నారు. డబుల్ డిజిట్ కంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గబోమని జన సమితి అంటున్నది.

ఆ తొమ్మిది సీట్లు ఇవేనా ?

విశ్వసనీయ సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీ ఇస్తామంటున్న 9 సీట్లు ఇవే అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అందులో

1 ఆసిఫాబాద్

2 అశ్వరావుపేట

3 బెల్లంపల్లి

4 రామగుండం

5 మల్కాజ్ గిరి

6 మలక్ పేట

7 సిద్ధిపేట

8 అంబర్ పేట

9 మిర్యాలగూడ

సీట్లు ఉన్నట్లు చర్చ నడుస్తున్నది.