ఏపీ మీద కేంద్రం పెద్ద పిడుగు వేసింది. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించుకుంది. చిత్తశుద్ధిగల మన రాజకీయ పార్టీలు, నాయకులు ఏదో ఆపేస్తామని, అడ్డుకుంటామని రాజీనామాల బెదిరింపులు, కేంద్రానికి లేఖలు అంటున్నారు కానీ అవేవీ జరిగేలా కనిపించట్లేదు. నష్టాల్లో ఉండనే కారణం చూపించి అమ్మకానికి పెట్టేశారు. ఒక్కసారి ఈ స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్రం వైఖరిని పరిశీలిస్తే ఈ అమ్మకం నిర్ణయం ఇప్పటిది కాదని చాలా ఏళ్ల నుండి, కేంద్రంలో పాలన చేస్తున్న పార్టీలు అనుకుంటున్నదేనని అర్థమవుతుంది.
అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా మొదట్లో ఈ ఉక్కు కర్మాగారానికి ఆనాటి ఇందిర ప్రభుత్వం అంగీకరించలేదు. పెద్ద ఉద్యమం నడిపి మూడు పదుల జనం ప్రాణత్యాగం చేస్తే తప్ప ప్రధాని ఇందిరాగాంధీ దిగిరాలేదు. 1971లో శంఖుస్థాపన చేశారు. ఆ దెబ్బతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు జనం. ఇందిరకు కావాల్సింది కూడ అదే. అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల వరకు మళ్ళీ పరిశ్రమను పట్టించుకోలేదు. చివరికి 1977లో 1000 కోట్లు మంజూరు చేశారు. భూసేకరణకు కూడ 1974లో నోటిఫికేషన్ ఇచ్చారు. అది కూడ అనేక ఒత్తిళ్ల మీదనే జరిగింది. ఆ తరువాత రష్యాను సంప్రదించి నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సహకారం కోసం 1979లో ఒప్పందం చేసుకున్నారు. ఉక్కు కర్మాగారంలో అత్యంత కీలకమైనది బ్లాస్ట్ ఫర్నేస్. మొదటి ఫర్నేస్ నిర్మాణానికి 1982లో శంకుస్థాపన చేశారు. ఉద్యోగుల కోసం టౌన్‌షిప్ నిర్మాణం మొదలుపెట్టారు.
మొదట 34 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం అని చెప్పినా, 1988లో దానిని 30లక్షల టన్నులకు కుదించేశారు. కార్మికులను 35 శాతం తగ్గించారు. అలా అనేక 1990 మార్చి 28న నాటి ప్రధాని వీపీ సింగ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకుని 1991లో ఉత్పత్తులు మొదలయ్యాయి. మొత్తం 64 గ్రామాల నుంచి 26వేల ఎకరాలు సేకరించారు. భూములను చాలా కారుచౌకగా తీసుకున్న ప్రభుత్వం ఎకరాకు రూ.1.000 నుంచి రూ.1,500 మాత్రమే పరిహారం ఇచ్చారు. 16000పైగా నిర్వాసిత కుటుంబాలు ఉండగా వారిలో ఇప్పటివరకు సగం మందికే ఉద్యోగాలు వచ్చాయి. ఇచ్చిన భూముల విలువ ఇప్పుడు లక్ష కోట్లకు మించడంతో వాటిని అమ్మి సొమ్ము చేసుకోవాలని కేంద్రం చూస్తోంది. ఈ విధంగా మొదటి నుండి విశాఖ ఉక్కు కర్మాగారం మీద కేంద్ర ప్రభుత్వాలకు ఉండాల్సిన చిత్తశుద్ధి లేదని స్పష్టంగానే అర్థమవుతోంది.