రేవంత్ రెడ్డి నిరసనకు దిగితే ప్రత్యర్థులకు కాలాల్సిందే. ఆయన విమర్శలు చేస్తే ఎంతటివారిలో అయినా కదలిక కనబడాల్సిందే. కాంగ్రెస్ పార్టీలో తన వెబిక గోతులు తీసేవారు ఎక్కువైపోయినా కూడ రేవంత్ తన పని తాను చేసుకుపోతున్నారు. ఇన్నాళ్లు కేసీఆర్ మీద తెరాస మీద టార్గెట్ పెట్టిన రేవంత్ ఇప్పుడు బీజేపీని ఢీకొట్టాల్సిన ఆవశ్యకతను గమనించి వారి మీద కూడ దృష్టి పెట్టారు. బీజేపీ ఏ నినాదాలనైతే అందుకుని బలపడిందో వాటినే రివర్స్ వాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఏకంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మీద దృష్టి పెట్టారు.
ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎన్నికల్లో ఏ నినాదం పట్టుకుని గెలిచారో అందరికీ తెలుసు. పసుపు బోర్డు ఏర్పాటు చేయమని నిజామాబాద్ రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పసుపును అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకునే వెసులుబాటు కలిగితే బ్రతుకులు బాగుపడతాయని వేడుకున్నారు. కానీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. దీన్నే ఎంపీ ఎన్నికలో అరవింద్ ఆయుధంగా మలుచుకున్నారు. పసుపు రైతుల తరపున ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికల్లో ఎంపీ కవితను ఓడించాలని పిలుపునిచ్చారు. అప్పటికే ప్రభుత్వం నుండి స్పందన కరువై ఆగ్రహంతో ఉన్న రైతులు కవితను ఓడగొట్టనే ఓడగొట్టారు.
ధర్మపురి అరవింద్ అనూహ్యరీతిలో విజయం సాధించి రాష్ట్రవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. పార్టీలో జెయింట్ కిల్లర్ అనే పేరు తెచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ గెలిస్తే పసుపు బోర్డు పెట్టించి తీరుతామని నమ్మబలికి, బాండ్ పేపర్ మీద సంతకాలు కూడ చేశారు. ఇప్పుడు దాన్నే గురుచేస్తున్నారు రేవంత్. ఢిల్లీలో కదం తొక్కడానికి పసుపు రైతులు సిద్ధం కావాలి. ఢిల్లీలో ప్రధాని మోదీని నిలదీసి పసుపు బోర్డు, మద్దతు ధర సాధిద్దాం అంటున్నారు. పసుపు పంటకు మద్దతు ధరతోపాటు బోర్డును తీసుకొస్తానంటూ బాండ్‌పేపర్ రాసిచ్చిన ధర్మపురి అరవింద్ ఆ హామీని ఇప్పటికీ నెరవేర్చలేకపోయారని ఆయన పేరులోనే ధర్మముందని కానీ తీరు మాత్రం అధర్మమేనని దుయ్యబట్టారు. మరి ఈ మాటలు రైతుల మీద పనిచేస్తే ఆనాడు ఎలాగైతే కవిత ఓడించిన వారికి రేపు ఎన్నికల్లో అరవింద్ ను ఓడించడం పెద్ద విషయమే కాదు.