తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అలసత్వంతో ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. తప్పు మీద తప్పు చేసి కేసీఆర్ చేతిలో చావుదెబ్బలు తింది. పార్టీలోని సీనియర్ నాయకులంతా తాతలు నేతులు తాగరనే నీతులే తప్ప పనితనం కనబర్చపోయసరికి పార్టీ అంతర్గతంగానే బలహీనపడిపోయింది. ఎంతసేపటికీ పీసీసీ చీఫ్ పదవి మీద ఆశలు పెట్టుకునేవారే తప్ప పనిచేసేవారు కరువయ్యారు.ప్రజలకు కూడ ఈ సంగతి చాలా త్వరగానే అర్థమైంది. ఇక ఆధిష్టానం అయితే గిల్లితే ఎడిస్తారేమోనని భయపడ్డట్టు అందరినీ సహిస్తూ వచ్చింది. చివరకు లాభం లేదనుకుని రేవంత్ రెడ్డిని పార్టీలోకి దింపింది. అతని రాక కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎవ్వరికీ గిట్టలేదు. రావడమే వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పదవి పొందిన రేవంత్ తమను మించిపోతాడాని భయపడి అడుగడుగునా అడ్డుతగిలారు.
ఎన్నికల్లో కొడంగల్ నుండి రేవంత్ ఓడటం తెరాస కంటే కాంగ్రెస్ నేతలకు సంతోషాన్నిచ్చింది. ఏదో పొడిచేస్తాడని తీసుకొచ్చారు. సొంత స్థానంలోనే గెలవలేకపోయాడు అంటూ ఎద్దేవా చేశారు. దీంతో ముందు సొంత పార్టీ నేతల ముందు ప్రూవ్ చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది రేవంత్ రెడ్డికి. అందుకే ఎంపీ టికెట్ తెచ్చుకొని మల్కాజ్ గిరి నుండి గెలిచి సత్తా చాటుకున్నారు. అప్పటికైనా ఆయన మీద వ్యతిరేకత తగ్గిందా అంటే అదీ లేదు. అధిష్టానం పీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డికి ఇస్తామంటే ససేమిరా అన్నారు. పార్టీ వదిలిపోతామని బెదిరించారు. దీంతో రేవంత్ చీఫ్ కాకుండా ఆగిపోయారు.
దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ల సందర్భంలో కూడ ఆయన్ను చీఫ్ పదవిలో కూర్చోబెట్టి ప్రయోగం చేయాలని చూసింది అధిష్టానం
శకునిల్లా అడ్డుపడ్డారు. చేసేది లేక హైకమాండ్ చేతులు ముడిచింది. సరే రేవంత్ రెడ్డిని కాదని వారించిన నాయకులు ఎన్నికల్లో పార్టీని నిలబెట్టారా అంటే అదీ లేదు. మూడవ స్థానానికి పడిపోయి అధికారికంగా ప్రధాన ప్రతిపక్షం హోదాను బీజేపీకి అప్పగించి చేతులు దులుపుకుని వచ్చింది. ఇవన్నీ రేవంత్ రెడ్డిని తీవ్ర అసహనానికి, నిరాశకు గురిచేశాయి. ఇక లాభం లేదనుకున్న హైకమాండ్ ఎవరేమనుకున్నా పగ్గాలు రేవంత్ చేతిలో పెట్టాలని నిర్ణయించుకుంది. కానీ సీనియర్ నేత జానారెడ్డి అడ్డుపడి ఇప్పుడు గనుక చీఫ్ ను మారిస్తే తన గెలుపు మీద ప్రభాభం పడుతుందని అంటూ ఆపించేశారు.
దీంతో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ భవిష్యత్తు మీదే కాదు అందులో ఉంటే తనకు కూడ ఫ్యూచర్ ఉండదనే నిర్ణయానికి వచ్చేశారు. సహనానికైనా ఒక హద్దు ఉంటుంది అన్నట్టు రేవంత్ రెడ్డి కాబట్టి ఇన్ని కుట్రల మధ్యలో కూడ పార్టీలో నెగ్గుకురావాలని చూశారు కానీ ఇంకోకరైతే ఎప్పుడో దండం పెట్టేసి వెళ్ళిపోయేవారే.