ఎమ్మెల్సీ ఎన్నికల తొలిరౌండ్ ఫలితాలు..ఆధిక్యంలో ఆ ఇద్దరే

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం తొలి రౌండ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 06.15 గంటలల సమయంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గ తొలి రౌండ్ ఫలితాలను ప్రకటించారు. రెండు నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు లీడింగ్‌లో నిలిచారు.

తొలిరౌండ్‌లో పల్లాకు ఆధిక్యం

నల్గొండ సెగ్మెంట్ పరిధిలో ఉదయం తొలి రౌండ్లో మొత్తం 56,003 ఓట్లు లెక్కించారు. ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 16,130 ఓట్లు పడ్డాయి. రెండో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన నిలిచారు. ఆయనకు 12,046 ఓట్లు పోలయ్యాయి. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం 9080 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 6615 ఓట్లతో నాలుగు స్థానంలో నిలిచారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ 4354 ఓట్లతో ఐదో స్థానంలో ఉన్నారు. 1,123 ఓట్లతో రాణి రుద్రమరెడ్డి ఆరో స్థానంలో, 1,077 ఓట్లతో చెరుకు సుధాకర్‌ ఏడో స్థానంలో, 1,008 ఓట్లతో జయసారథిరెడ్డి ఎనిమిదో స్థానంలో నిలిచారు. 2,789 చెల్లని ఓట్లు పోలయ్యాయి.

హైదరాబాద్ సెగ్మెంట్ పరిధి తొలి రౌండ్ ఫలితాలు చాలా ఆలస్యంగా వచ్చాయి. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ లీడింగ్‌లో ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవికి 17,429 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు రెండో స్థానంలో ఉన్నారు. ఆయనకు 16,385 ఓట్లు పోలయ్యాయి. తొలి రౌండ్‌లో వాణీదేవి 1044 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయనకు 8,357 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నా రెడ్డి నాలుగో స్థానంలో ఉన్నారు. చిన్నారెడ్డికి 5,501 ఓట్లు పడ్డాయి. భారీగా ఓట్లు పోలవడంతో ఫలితాలు మరింతగా ఆలస్యం అయ్యే అవకాశముంది. అటు సిబ్బంది అవగాహన లేమితోనూ కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యంగా కొనసాగుతోంది.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్‌ పట్టభద్రుల నియోజవర్గంలో 93 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 3,57,354 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక నల్గొండ-వరంగల్-ఖమ్మం నియోజక పరిధిలో 71 మంది బరిలో ఉన్నారు. 3,86,320 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు