ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మంత్రులుగా వీరికే చాన్స్

తెలంగాణలో కేబినేట్ కూర్పు రోజుకింత ఆలస్యం అవుతుండడంతో మంత్రి పదవులు ఎవరికి దక్కనున్నాయనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. శనివారం మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ పీడ దినాలు పోయినంకనే మంత్రి వర్గం ఏర్పాటు చేస్తామన్నారు. సంక్రాంతి తర్వాతే కేబినేట్ కూర్పు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఉమ్మడి కరీంనగర్ లో మాత్రం ఆ ఇద్దరు నేతలకు మంత్రి పదవులు ఖరారైనట్టేనని అంతా చర్చించుకుంటున్నారు.

హూజురాబాద్ నుంచి గెలిచిన ఈటెల రాజేందర్ గతంలో ఆర్ధిక శాఖ మంత్రిగా పని చేశారు. అయితే ఆయనకు ఈ సారి స్పీకర్ పదవి దక్కుతుందని జోరుగా చర్చ జరిగింది. దీంతో ఈటెల కేసీఆర్ తో చర్చించి సున్నితంగానే స్పీకర్ పదవి వద్దని చెప్పారట. దీంతో ఈటెలకు మంత్రి వర్గంలోనే బెర్తు ఖాయమనే హామీ కేసీఆర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఈటెల  రాజేందర్ ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు చేపట్టాక అనేక మార్పులు తీసుకు వచ్చారని, సౌమ్యునిగా పేరుండడంతో ఆయనకు మళ్లీ మంత్రి పదవి ఖాయమని నేతలు అంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఈటెలకు మొదటి బెర్తులోనే మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. అయితే ఈటెలకు గతంలో నిర్వహించిన ఆర్ధిక శాఖనే తిరిగి అప్పగిస్తారా లేక శాఖ మార్పు జరుగుతుందా అనేది తెలియాల్సి ఉంది.

ధర్మపురి నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొప్పుల ఈశ్వర్ కు కూడా మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. గతంలో కొప్పుల ఈశ్వర్ చీఫ్ విప్ గా పని చేశారు. గత కేబినేట్ లోనే కొప్పులకు మంత్రి పదవి దక్కుతుందనుకున్నారు కానీ దక్కలేదు. అయితే కొప్పుల ఈశ్వర్ పేరు స్పీకర్ పదవికి కూడా వినిపించింది. స్పీకర్ పదవి వచ్చినా చేపట్టేందుకు సిద్దంగా లేనని ఇప్పటికే కొప్పుల టిఆర్ఎస్ పెద్దలకు తెలియజేశారంట. మంత్రి పదవి కావాలనే ఆయన కోరుతున్నారట. ఇప్పటికే పలువురు పార్టీ పెద్దలతో ఆయన మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేసీఆర్ మాట్లాడుతూ కొప్పుల ఈశ్వర్ గెలిస్తే ఈ సారి పెద్ద పదవి వస్తదని చెప్పాడు. దాంతో కొప్పులకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తదని నేతలు ఆశిస్తున్నారు. 

ఇదే జిల్లా నుంచి గంగుల కమలాకర్, కోరుగంటి చందర్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. కానీ వీరికి మంత్రి పదవి దక్కే అవకాశం లేనట్టేనని చర్చ జరుగుతోంది. గంగుల కమలాకర్ కూడా మంత్రి పదవి కోసం గట్ట ిప్రయత్నాలే చేస్తున్నాడట. కానీ సీనియార్టి పేరుతో అతనికి మంత్రి పదవి రాకపోవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వతంత్ర అభ్యర్దిగా గెలిచిన కోరుకంటి చందర్ ఆ తర్వాత టిఆర్ఎస్ చేరారు. కానీ అతనికి కూడా మంత్రివర్గంలో బెర్తు దక్కకపోవచ్చని తెలుస్తోంది.