హైకోర్టులో పిటిషన్ వేసిన రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి, అక్రమాలతో గెలిచాడని అతడిని అనర్హుడిగా ప్రకటించాలని రేవంత్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. రేవంత్ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించి విచారించనుంది. ఎన్నికల్లో మద్యం, నగదు పంచారని, ఈవిఎంల పై కూడా అనుమానాలు ఉన్నాయని రేవంత్ పిటిషన్ లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయాన అందరి చూపు కొడంగల్ పైనే ఉంది. కొడంగల్ లో రేవంత్ రెడ్డి గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా టిఆర్ఎస్ అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి విజయం సాధించారు. అయితే పట్నం నరేందర్ రెడ్డి కోట్ల రూపాయలు పంచారని, విచ్చల విడిగా మందు పంచారని రేవంత్ గతంలో ఆరోపించారు. ఎన్నికల సమయాన కొడంగల్ లో టఫ్ పరిస్థితి ఏర్పడింది. రేవంత్ రెడ్డిని పలు కారణాలతో అరెస్టు చేయడంతో కొడంగల్ లో హైటెన్షన్ వాతావరణం నడిచింది. 

హరీష్ రావు, కేటిఆర్, సీఎం కేసీఆర్ కొడంగల్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ముందుగా పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ లో పోటి చేయడానికి ఇష్టం చూపలేదు. కేటిఆర్ పట్టుబట్టి నరేందర్ రెడ్డిని బరిలో నిలిపాడు. అంతే కాదు చాలెంజ్ గా తీసుకొని గెలిపించుకున్నాడు. రేవంత్ రెడ్డి తను  గెలుస్తానన్న ధీమాతో ఇతర నియోజకవర్గాలలో కూడా ప్రచారం చేశాడు.  కానీ చివరికి అనూహ్యంగా రేవంత్ ఓటమి పాలయ్యారు. రేవంత్ రెడ్డి గెలుస్తాడని అంతా భావించారు. కానీ చివరి క్షణాన బలపడ్డ పట్నం నరేందర్ రెడ్డి విజయం సాధించాడు.  

టిఆర్ఎస్ పార్టీ అక్రమాలు చేసి గెలిచిందని కాంగ్రెస్ నేతలు గతంలోనే ఆరోపించారు. ఈవీఎంలలో కూడా అక్రమాలు చేశారని, అధికార యంత్రాగాన్ని తమ ఆధీనంలో పెట్టుకున్నారన్నారు. ఎన్నికల అధికారులు టిఆర్ఎస్ ఏజంట్లలా పని చేశారని, అందుకే టిఆర్ఎస్ విజయం సాధించిందని వారు బహిరంగ విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత రేవంత్ రెడ్డి కాస్త రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి మరో రెండేళ్ల వరకు మీడియాతో మాట్లాడడని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత అవి నిజం కాదని రేవంత్ అనుచరులు తెలిపారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల హడావుడిలో రేవంత్ ఉన్నారు.  

గురువారం ఉదయం రేవంత్ రెడ్డి హైకోెర్టులో పిటిషన్ వేశారు. టిఆర్ఎస్ తరపున గెలిచిన పట్నం నరేందర్ రెడ్డి అనేక అక్రమాలు చేశారని అందువల్లనే ఆయన గెలిచాడన్నారు. పట్నం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్యేగా కొనసాగే హక్కు లేదని అతనిని వెంటనే అనర్హుడిగా ప్రకటించాలని ఆయన కోరారు. దీని పై విచారించి అతని పై చర్యలు తీసుకోవాలన్నారు. గత కొంత కాలంగా నిశ్శబ్దంగా ఉన్న రేవంత్ రెడ్డి అనూహ్యంగా టిఆర్ఎస్ సర్కార్ పై మళ్లీ తన విమర్శనాస్ర్తాలు మొదలు పెట్టాడన్న చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పిటిషన్ లు వేసి టిఆర్ఎస్ సర్కార్ ను రేవంత్ రెడ్డి  ఇరుకున పెట్టారు. రేవంత్ మళ్లీ తన వ్యూహాలు అమలు చేస్తుండడంతో క్యాడర్ మంచి జోష్ లో ఉంది.