మూసీ నదిలో ముంచి కేటీఆర్‌ కు సన్మానమట !

revanth reddy controversial comments on KTR

తెలంగాణా రాజకీయాలలో ఇప్పుడు నయా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేరు బాగా వినిపిస్తుంది. ప్రత్యర్థుల్ని ఏ మాత్రం లెక్కచేయకుండా ఎలాంటి విమర్శలైనా చేయగల సత్తా ఉన్న రేవంత్ రెడ్డి అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత దూకుడు మరింత పెంచేశారు. తాజాగా ఆయన సీఎం కెసిఆర్,మంత్రి కేటీఆర్‌ లపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు.

revanth reddy controversial comments on KTR

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…ఇటీవల విడుదలైన నివాసయోగ్యమైన పట్టణాల జాబితాలో హైదరాబాద్‌ కు స్థానం రాకపోవటానికి కారణం కెసిఆర్, కేటీఆర్‌ లని ఆయన విమర్శించారు. హైదరాబాద్ ను ఉద్ధరించింది ఏమీ లేకపోగా తండ్రి కొడుకులు నగరాన్ని పాడు చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. నగరంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇటీవల కాలంలో వేరొక రాష్ట్రంలో ఓ కాంట్రాక్టర్‌ మోరీలలో చెత్త తీయకుండా ఉంచేసి ఆ మురుగు నీరంతా రోడ్ల మీదకి వచ్చినా పట్టించుకోలేదట. దాంతో ఆ ప్రాంత ఎమ్మెల్యే ఆ కాంట్రాక్టర్‌ ని పిలిపించి ఆ మురుగు నీటిలో కూర్చోబెట్టి అతనిపై చెత్త వేయించిన సంఘటనను ఉదహరిస్తూ… కేటీఆర్‌ ను మూసీ నదిలో ముంచి సన్మానం చేయాలని ఉందని అన్నారు.

మూసీలో నడుము లోతులో నాలుగు గంటలు ఉంచితే అప్పుడు పేద ప్రజల సమస్యలు అర్థమవుతాయని, ఏదో ఒకరోజు ఆ పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ లో తండ్రి కొడుకులు అరగంట పర్యటించి అంతా బాగుందని బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మంత్రులు, ప్రజా ప్రతినిధులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని రేవంత్ సూచించారు.