ఆరు మీద కేసీఆర్ మోజు.. ఈసారి వర్కవుట్ అవుతుందా ?

KCR following numerology for GHMC elections

రాజకీయ నాయకులకు సెంటిమెంట్లు ఉండటం సర్వ సాధారణం.  సంఖ్యా శాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం, గడియలను ఎక్కువగా ఫాలో అవుతుంటారు.  పాలనా రోజున, పాలనా సమయంలో పని మొదలుపెడితే తప్పకుండా విజయం సిద్ధిస్తుందని నమ్ముతుంటారు.  అలాంటి వారిలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకరు.  ఎట్టి పరిస్థితుల్లోనూ సెంటిమెంట్ మిస్ అవ్వకుండా చూసుకుంటారు ఆయన.  ముఖ్యంగా సంఖ్యా శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు.  ఎన్నికలకు కూడ న్యూమరాలజీని పాటిస్తుంటారు.  ఆయనకు 6 అనేది లక్కీ నెంబర్.  ఎన్నికలకు సంబంధించి ఏదైనా ముఖ్యమైన కార్యం చేసేటప్పుడు అందులో 6 ఉండేలా చూసుకుంటారు.  అభ్యర్థుల జాబితా ప్రకటించే తేదీ, జాబితాలోని అభ్యర్థుల సంఖ్యలు 6గా ఉండేలా జాగ్రత్తపడతుంటారు. 

KCR following numerology for GHMC elections
KCR following numerology for GHMC elections

గత అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేటప్పుడు అందులో 105 మంది సభ్యులను ప్రకటించారు.  105 ను కూడితే చివరగా 6 వస్తుంది.  అందుకే 105 మందితో జాబితా వేశారు.  ఇక ఆ జాబితాను ప్రకటించిన తేదీ కూడ సెప్టెంబర్ 6 వ తేదీనే కావడం విశేషం.  ఆ ఎన్నికల్లో తెరాస ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.  ఊహించందానికంటే ఎక్కువ సీట్లు తెచ్చుకుంది.  అందుకే అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తూ తాజాగా గ్రేటర్ ఎన్నికల జాబితాను కూడ 105 మంది సభ్యులతో విడుదలచేశారు.  అక్కడ కూడ 6 నెంబర్ ఉండేలా జాగ్రత్తపడ్డారు.  అలాగే 2016 జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడ అభ్యర్థుల తొలి జాబితాలో కూడ 6 నెంబర్ వచ్చేలా 60 మంది సభ్యుల పేర్లను మాత్రమే ఉంచారు.  ఆ జాబితాను ప్రకటించింది జనవరి 16 వ తేదీన.  16 లో కూడ 6 నెంబర్ ఉండనే ఉంది. 

ఈ రెండు ఎన్నికల్లోనూ తెరాస భారీ విజయాలను కైవసం చేసుకుంది.  అందుకే 6 నెంబర్ అంటే కేసీఆర్ కు అంత నమ్మకం.  అయితే ఈ సెంటిమెంట్ ను కేసీఆర్ ఒకసారి మిస్ చేశారు.  గత అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక భారీ విజయం ఖయమని  తేలాక కేసీఆర్ అతి నమ్మకంతో లోక్ సభ ఎన్నికలకు వెళ్లారు.  17 లోక్ సభ స్థానాలకు 17 మంది పేర్లతో ఒకేసారి జాబితాను విడుదలచేశారు.  ఆ ఎన్నికల్లో కేవలం 9 ఎంపీ స్థానాలే వచ్చాయి.  ఈ చేదు ఫలితాలకు కారణం సంఖ్యా శాస్త్రాన్ని ఫాలో కాకుండా, జాబితాలో 6 నెంబర్ ఉండేలా చూసుకోకుండా ముందుకెళ్లడమేనని అప్పట్లో టాక్ నడిచింది.  కేసీఆర్ సైతం అసెంబ్లీ ఎన్నికల్లో అంత గొప్పగా గెలిచి  ఎంపీ ఎన్నికల్లో చతికిలబడటానికి న్యూమరాలజీని ఫాలో కాకపోవడమేనని  ఫీలయ్యారట. 

అందుకే ఈ అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో 6 నెంబర్ తగిలేలా అభ్యర్థుల జాబితా రిలీజ్ చేశారు.  ఈ ఎన్నికలు తెరాసకు చాలా ముఖ్యమైనవి.  ఇవి గనుక అటు ఇటు అయి తేడా కొడితే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది.  అంతేకాదు ప్రత్యర్థి పార్టీ బీజేపీ మరింత బలపడుతుంది.  అందుకే కేసీఆర్ సంఖ్యా శాస్త్రాన్ని మిస్ చేయలేదు.  లక్కీ నెంబర్ 6ను వెంటపెట్టుకున్నారు.  మరి ఆ 6 నెంబర్ ఆయనకు ఈసారి ఎలాంటి ఫలితాలను  అందిస్తుందో చూడాలి.