ఇకపై ఆ పదం తెలంగాణ డిక్షనరీలోనే ఉండదు : హరీష్ రావు

తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. సిద్దిపేటలోని కొండ మల్లయ్య గార్డెన్ లో సిద్దిపేట నియోజకవర్గ ప్రయివేటు స్కూల్స్ యాజమాన్యాలు  ట్రెస్మా ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావుకు ఆశీర్వాద సభ ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. ఆయనేమన్నారో చదవండి.

ఆంధ్రాలోని కోనసీమను తలపించేలా సిద్దిపేట తయారవుతుంది. రిజర్వాయర్ల ఖిల్లాగా సిద్దిపేట జిల్లా మారబోతున్నది. ప్రతి వినియోగదారునికి 24 గంటల కరెంటు ఇచ్చి చరిత్ర సృష్టించిన రాష్ట్రం తెలంగాణ. నేడు విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఇది మన అభివృద్ధికి సూచిక.

మహా కూటమికి రాద్ధాంతం తప్ప సిద్దాంతం లేదు. టీడీపీ పుట్టిందే తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం. కానీ నేడు ఢీల్లికి తాకట్టు పెట్టింది ఆ పార్టీ. తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబుతో పొత్తు  పెట్టుకుంటారా? కాళేశ్వరం ప్రాజెక్ట్ ను చంద్రబాబు అడ్డుకుంటున్నడు. రైతుల కరెంటు ఇవ్వకుండా రాక్షస ఆనందం పొందిన చంద్రబాబుతో మీకు పొత్తా ?

కమ్యూనిస్టు పార్టీలో కార్యదర్శి కె టికెట్ లేదు. సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కే టికెట్ రాకపోతే ఆ కూటమి ఎందుకు? ఓటుకు నోటు దెబ్బతోనే చంద్రబాబు అమరావతికి వెళ్లాడు. తెలంగాణ కోసం కొట్లాడే ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే కేసీఆర్ ఇంకా పది సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలి. మహాకూటమి కి మహా ఓటమి తప్పదు. డ్రంక్ అండ్ డ్రైవ్ తీసేసి… ఫుల్లు తాగాలి, బండి నడపాలి అనే విధంగా ఈ మధ్య కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు.

ఒక్కసారి కాళేశ్వరం పూర్తి అయితే కరువు అనే పదం తెలంగాణ డిక్షనరీలో ఉండదు. కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ మారుతుంది. ఆసియాలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. అలాంటి ప్రాజెక్ట్ నాలుగు సంవత్సరాలలో పూర్తి చేయబోతున్నాం.  CWC ఇంజనీర్లే మన కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసి నేర్చుకొని పోయారు. 

 మీరు కోరిన న్యాయమైన డిమాండ్లు గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి మేనిఫెస్టోలో పెట్టే విధంగా కృషి చేస్తా. ప్రయివేటు పాఠశాలలు నిలబడాలి. ప్రయివేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారించే విధంగా కృషి చేస్తా. ఏ అవార్డు వచ్చిన సిద్దిపేట పేరు ఖచ్చితంగా ఉంటుంది. ప్రజల సహకారంతోనే ఈ ఫలితాలు సాధించాం.

సిద్దిపేటలో విద్యా వ్యవస్థ బలపడింది. యశోద, అపోలో ఆసుపత్రి తరహాలో సిద్దిపేటలో ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించుకున్నాం.  నగరాలకుండే అన్ని వసతులు సిద్దిపేటకు తెచ్చాం. యుద్ధ ప్రాతిపదికన రైల్వే పనులు జరుగుతున్నాయి. రెండు జాతీయ రహదారులు సిద్దిపేటకు మంజూరు అయ్యాయి.

మా ఊరికి కూడా కోమటి చెరువు లాంటి చెరువు కావాలనే విధంగా తయారు చేసుకున్నాం. కొన్ని సంవత్సరాల తరబడి పరిష్కారం కాని సమస్యలను ఈ నాలుగు సంవత్సరాలలో చేసుకున్నాం. సిద్దిపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్ళు రావాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి. నెల రోజులు మీరు కష్టపడండి, మిగతా 5 సంవత్సరాలు మేము కష్టపడి పని చేస్తాం.