పారిశుద్ధ్య కార్మికునిగా మంత్రి హరీశ్ రావు … అయ్యయ్యో ఏమైంది !

సిద్ధిపేట జిల్లా బుస్సాపూర్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, పారిశుద్ధ్య కార్మికునిగా మారిపోయారు. కార్మికులతో కలసి వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే యూనిట్ వద్ద పనిచేశారు. ఈ సందర్భంగా కార్మికులు ధరించే యూనిఫామ్ ను వేసుకున్న హరీశ్ రావు, వృథా అని భావించే ప్రతి వస్తువునూ ఏదో రూపంలో తిరిగి వినియోగించుకోవచ్చని అన్నారు.చెత్త చెదారాలను కొంచెం ఆలోచించి, శ్రమను జోడిస్తే, ఎరువులుగా, ఉపయోగకరమైన పదార్థాలుగా మార్చుకునే వీలుంటుందని వ్యాఖ్యానించిన హరీశ్ రావు,

Telangana Minister Harish Rao in Siddhipet

సిద్ధిపేట పట్టణంలో రోజుకు 40 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందని, దీనిలో తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు రూ. 2.50 కోట్లతో రీసైక్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇదే తరహా మానవ ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంటును తొలుత సిరిసిల్లలో ఏర్పాటు చేసి సత్ఫలితాలు పొందామని, అన్ని మునిసిపాలిటీల్లో ఇవే తరహా ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని అన్నారు. ప్రజలు సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాలను ఎస్ఎఫ్టీపీకి ఇవ్వాలని, దాన్ని రీసైకిల్ చేసిన తరువాత 800 కేజీల ఎరువు, 16 వేల లీటర్ల నీరు వస్తుందని నీటిని మొక్కలకు, ఎరువునురైతులకు ఫ్రీగా ఇవ్వనున్నామని అన్నారు.

ఇక తెలంగాణలో త్వరలోనే కొలువుల జాతర మొదలవుతుందన్న విషయాన్ని యువతకు తెలియజేయాలని కేసీఆర్ చెప్పారని వ్యాఖ్యానించిన హరీశ్ రావు, మొత్తం 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడనున్నాయని అన్నారు. ఈ ఉద్యోగాలను సులువుగా పొందేందుకు యువతకు ప్రత్యేక శిక్షణా శిబిరాలను జిల్లా స్థాయిలో అందుబాటులో ఉంచామని, ఇక్కడ అన్ని రకాల మెటీరియల్ అందుబాటులో ఉంటుందని అన్నారు.