గుత్తా జ్వాల ఓటు గల్లంతు

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పేరు ఓటర్ల జాబితాలో గల్లంతైంది. దీంతో అధికారుల పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.  గత ఎన్నికల్లో తాను ఓటు వేశానని ఇప్పుడు ఎందుకు గల్లంతయ్యిందో, ఏ కారణంతో తీసేశారో తనకు తెలియదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైనప్పుడు ఎన్నికలు ఎలా పారదర్శకంగా నిర్వహిస్తారని ఆమె ప్రశ్నించారు. తన ఓటు పోయిందని, ఓటర్ల జాబితాలో ఓటు లేకపోవడంతో ఆశ్చర్యపోయాను అంటూ ఆమె వరుస ట్వీట్లు చేశారు. ఆమె ట్వీట్లకు  మద్దతుగా తమ ఓట్లు కూడా పోయాయని పలువురు కామెంట్లు పెట్టారు.

 

ఓటర్ల జాబితాలో చాలా మంది ఓట్లు మిస్ అయ్యాయి. చాలా మంది పోలింగ్ సెంటర్ల దగ్గరకు వచ్చిన తర్వాత తమ పేరు లేదనడంతో వారు నిరాశకు గురయ్యారు. మరి కొంత మంది అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉన్నా కూడా ప్రస్తుతం ఎందుకు తీసేశారో అర్ధం కావటం లేదన్నారు. చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అసంతృప్తికి గురయ్యారు. మరికొంత మంది ఉద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు.

ఓటరు లిస్టులలో అక్కడక్కడ తప్పులు జరిగింది వాస్తవమేనని వీటిని సరిదిద్దుతామని ఎన్నికల అధికారి ప్రకటించారు. డిసెంబర్ 26 నుంచి మరో సారి ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఇస్తామని అధికారులు తెలిపారు.