ఎన్నికల వేళ ఈవీఎం సిత్రాలు చాలా వినూత్నంగా బయటపడుతుంటాయి. ఓ బటన్ మీద నొక్కితే, ఇంకో బటన్ మీద పని జరుగుతుంటుంది. ఓ పార్టీకి ఓటేస్తే, ఆ ఓటు ఇంకో పార్టీకి వెళుతుంటుంది. అది కూడా మనిషి తయారు చేసిన పరికరమే కదా.. లోపాలు మామూలే. మనిషి తయారు చేసిన పరికరం, మనిషి చెప్పినట్లు నడుచుకోవడంలోనూ వింతేమీ వుండదు. అధికారంలో ఎవరుంటే, వారికి అనుకూలంగా ఈవీఎంలు పనిచేస్తాయన్న విమర్శ ఎప్పటినుంచో వుంది.
ఇక, అసలు విషయానికొస్తే, అసోం రాష్ట్రంలో ఎన్నికల వేళ ఓ సిత్రం చోటు చేసుకుంది. ఈవీఎం మెషీన్లను, పని పూర్తయ్యాక.. ఎమ్మెల్యేకి చెందిన కారులో తరలించారు. అది కూడా బీజేపీ ఎమ్మెల్యే కారు కావడం గమనార్హం. ‘అబ్బే, ఆ కారు నాది కాదు.. నా బంధవులది’ అని సదరు ఎమ్మెల్యే చెబుతున్నాడట. అధికారులకు మతి పోయిందా.? బీజేపీ ఎమ్మెల్యేకు బానిసత్వం చేస్తున్నారా.? అన్న విమర్శలు రావడం మామూలే. మరోపక్క, సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై పెను రాజకీయ దుమారమే రేగుతోంది. అధికారంలో వున్నోళ్ళ ఇలా ఈవీఎంలతో ఆటలాడుతోంటే, విపక్షాలు తమ ఉనికిని చాటుకోవడం కష్టమేనన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇంకొందరు ఓ అడుగు ముందుకేసి, ముందు ముందు ఈవీఎంలు, ‘అమెజాన్’లోనూ దొరుకుతాయ్.. అని సెటైర్లు వేస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే పాలకులకి, రాజకీయ పార్టీలకీ, అధికారులకీ అంత వేటెకారం అయిపోయింది మరి. ఎన్నికలు.. అంటే, అదొక బాధ్యత. కానీ, కీలక పదవుల్లో వున్నవారు బాధ్యత విస్మరిస్తుండడంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోంది. అన్నట్టు, ఈవీఎం ఓ ఎమ్మెల్యే వాహనంలో తరలించిన ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది.. ఆ పోలింగ్ బూత్ వరకూ రీ-పోలింగ్ కోసం ఆదేశాలు జారీ చేసింది.