పరిషత్ ఎన్నికల సందర్భంగా జనసేన మద్దతుదారులైన కొందరు నెటిజన్లు, మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ గుండెల్లో రైళ్ళు పరిగెత్తించేస్తున్నారు. ‘నేను గ్లాసు గుర్తుకి ఓటేశాను. ఒకవేళ అక్కడ గ్లాసు గుర్తు బ్యాలెట్ పేపర్ మీద కన్పించకపోతే, నోటా గుర్తు కనిపిస్తుంది.. దానికే ఓటెయ్యండి.. వేరే గుర్తుకి ఓటెయ్యొద్దు..’ సాటి జనసేన మద్దతుదారులకు సూచిస్తున్నారు నెటిజన్లు. ఇదెక్కడి చోద్యం.? అని అంతా ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. కొందరైతే ఏకంగా బ్యాలెట్ పేపర్ ఫొటో తీసి మరీ సోషల్ మీడియాలో పెట్టేస్తుండడం గమనార్హం.
పరిషత్ ఎన్నికల వేళ, ఎన్నికల విధులు నిర్వహిస్తోన్న సిబ్బంది అలసత్వమే ఇందుకు కారణం. ఇక, పరిషత్ ఎన్నికల సందర్భంగా జనసేన కార్యకర్తలు, మద్దతుదారుల తీరు.. మిత్రపక్షం బీజేపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పంచాయితీ ఎన్నికల్లో కూడా జనసేన – బీజేపీ మధ్య ఓట్ల మార్పిడి జరగలేదు. మునిసిపల్ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి.
పంచాయితీ, మునిసిపల్, పరిషత్ ఎన్నికల వ్యవహారం వేరు. తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక పరిస్థితి వేరు. తిరుపతి ఉప ఎన్నికని బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి ఓటూ బీజేపీకి అత్యంత కీలకం. ఈ పరిస్థితుల్లో జనసేన ఓటు బ్యాంకు నోటా వైపుకు వెళితే బీజేపీ పరిస్థితేంటి.? అసలు జనసైనికులు ఓట్లేయడానికే ముందుకు రాకపోతే ఏంటి పరిస్థితి.? ఇదే ఇప్పుడు బీజేపీ అధినాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
‘జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు ఓటెయ్యండి..’ అని సాక్షాత్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చినా, కార్యకర్తలు లెక్క చేయకపోతే.. బీజేపీ – జనసేన మధ్య బంధం తెగిపోవడం ఖాయమే. బహుశా అధినేత, బీజేపీ నుంచి దూరంగా జరపడం కోసం జనసైనికులే ఈ తరహా వ్యూహాల్ని రచిస్తున్నారని అనుకోవాలా.?