ఖమ్మంలో టిఆర్ఎస్ డబ్బు పంపిణీ.. కాంగ్రెస్ భట్టి సీరియస్

ముదిగొండలో కలకలం సృష్టించిన డబ్బు పంపిణీ కలకలం , టిఆర్ఎస్ బ్బు ఆధార్, బ్యాంక్ అకౌంట్లు సేకరిస్తుండగా పట్టుకున్నామన్న అధికారులు స్వయంగా భట్టి వచ్చి ఫిర్యాదు.

ఖమ్మం జిల్లా ముదిగొండలో డబ్బు పంపిణీ కలకలం సృష్టిస్తోంది. టిఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఆధార్, బ్యాంకు అకౌంటు నెంబర్లు సేకరిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుకున్నారు. టిఆర్ఎస్ నాయకులు నేరుగా డబ్బులు ఇస్తే దొరుకుతామని ఇలాంటి పనులు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా వివరాలు సేకరించి వారి అకౌంట్లలోకి ఓట్లను బట్టి రెండు వేల రూపాయల నుంచి పది వేల రూపాయలు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారని వారు ఆరోపించారు.

డబ్బు పంపిణి విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేత, మధిర కాంగ్రెస్ అభ్యర్ది భట్టి విక్రమార్క అక్కడకు చేరుకున్నారు. డబ్బు పంపిణి విషయమై స్థానిక నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయనే స్వయంగా ముదిగొండ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కదిలిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఓట్లకు డబ్బులు పంచుతున్న విషయం ఖమ్మం రాజకీయాలలో చర్చనీయాంశమైంది. అన్ని ఆధారాలు ఉన్నా కూడా పోలీసులు ఎందుకు స్పందించలేదని ఆయన నిలదీశారు. ఈ విషయమై భట్టి ఏం మాట్లాడారంటే…

“టిఆర్ఎస్ వాళ్లు ఓట్లకు డబ్బులు పంచుతున్నారు. అనేక గ్రామాలలో ఓటర్ల దగ్గర బ్యాంకు అకౌంట్లు, ఆధార్ నంబర్లు తీసుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన కాంగ్రెస్ కార్యకర్తలు వివరాలు సేకరిస్తున్న వారిని పట్టుకున్నారు. వారి పై ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రం దీనిని పట్టించుకోకుండా వదిలేశారు. కార్యకర్తలు నాకు ఈ విషయమై సమాచారం ఇచ్చారు. వెంటనే నేను ముదిగొండ పోలీసు స్టేషన్ వెళ్లి పోలీసులను అడిగాను. మా వాళ్లు ఆధారాలు చూపించినా కూడా ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించాను.

పోలీసులు తమకు ఫిర్యాదు అందలేదని చెప్పారు. ఫిర్యాదు చేసిన కార్యకర్తలను చూపించగా పోలీసులు నీళ్లు నమిలారు. ఆ తర్వాత నేను వారికి రాత పూర్వకంగా ఫిర్యాదు చేశాను. అప్పుడు పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు.

పోలీసులు టిఆర్ఎస్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ప్రజాస్వామ్యంలో హాక్కులను కాపాడాల్సిన వారు విస్మరించి ప్రవర్తిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం. టిఆర్ఎస్ వారు ఓడిపోతారని తెలిసి ఈ విధంగా పిచ్చి రాజకీయాలు చేస్తున్నారు. అని భట్టి విక్రమార్క అన్నారు. “

డబ్బు పంపిణి అంశం ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతోంది. ముదిగొండ స్టేషన్ కు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకొని నిరసన తెలిపారు. డబ్బు పంపిణీ కోసం కొత్త విధానం బయటపడడంతో అంతటా చర్చనీయాంశమైంది.