మతిస్థిమితం సరిగా లేనివారు వారు ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా వారికి తెలియదు. ఈ క్రమంలో వారు చేసే పనుల వల్ల ఎదుటివారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇటీవల ఒక మతిస్థిమితం లేని మహిళ చేసిన పనికి ఒక కుటుంబం ప్రాణాల మీదకు వచ్చింది. మతిస్థిమితం లేని మహిళ వంటనూనె అనుకొని పురుగుల మందు పోసి వంట చేసి తాను తినటమే కాకుండా కుటుంబ సభ్యులకు వడ్డించింది.దీంతో కుటుంబసభ్యుల ఆరోగ్యం విషమంగా మారింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.
పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం…మేడిద పల్లికి చెందిన బండ్ల నాగమ్మ (37), పుల్లయ్య దంపతులు గ్రామంలో నివాసం ఉంటూ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా నాగమ్మ మానసిక పరిస్థితి సరిగా లేదు. కొంత కాలంగా నాగమ్మ మతిస్థిమితం సరిగలేక ఇబ్బంది పెడుతోంది. అయినప్పటికీ ఇంట్లో పనులు, పొలం పనులు కూడా చేసుకునేది. ఈ క్రమంలో గురువారం ఉదయం నాగమ్మ ఇంట్లో వంట చేయటానికి వంట నూనెకు బదులు దాని పక్కనే ఉన్న పురుగుల మందు వేసి వంట చేసింది. ఆ తర్వాత పురుగుల మందు వేసి వండిన కూరతో తాను అన్నం తిని పొలం పనులకు వెళ్లిన భర్త, కూతురికి భోజనం తీసుకుని వెళ్ళింది.
పొలం పనులు చేస్తున్న భర్త , కూతురు నాగమ్మ తెచ్చిన భోజనం తినటానికి కూర్చోగా పురుగుల మందు వాసన రావడంతో కూతురు ఆ భోజనం తినలేదు. కానీ పుల్లయ్య మద్యం మత్తులో ఉండటంతో వాసన గ్రహించలేక కొంచెం ఆహారం తిన్నాడు. అయితే ఇలా పురుగుల మందుతో వండిన ఆహారాన్ని తినటం వల్ల నాగమ్మ ఆమె భర్త పుల్లయ్య అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానికులు వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో నాగమ్మ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందగా, పుల్లయ్య ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని పుల్లయ్య ని విచారించగా జరిగింది మొత్తం చెప్పాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.