షర్మిళ – తుమ్మల… మధ్యలో పాలేరు!

తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యాన్ని తీసుకోస్తామంటూ తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ షర్మిల స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాదయాత్రతో పాటు అనేక విషయాలపై పోరాటాలు చేశారు. అయితే… అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇది పొత్తా.. విలీనమా అనే చర్చ గతకొన్ని రోజులుగా వార్తల్లో నానుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ వెళ్లిన షర్మిళ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అయితే… వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

కానీ… తాను ఏం చేసినా తెలంగాణ ప్రజల కోసమే.. తెలంగాణ ప్రజల మేలు కోసమే తన తాపత్రయం అని షర్మిల చెప్పుకొచ్చారు. విలీనంపై త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని అన్నారు.

ఆ సంగతి అలా ఉంటే… పొత్తైనా.. విలీనమైనా.. రాబోయే ఎన్నికల్లో షర్మిళ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతుండటం చర్చనీయాంశంగా మారింది. కారణం… ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి, పాలేరు నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని అనుకోవడం.

దీంతో… షర్మిళ కాంగ్రెస్ లోకి రావడాన్ని ఏమాత్రం ఆహ్వానించడం లేదనే పేరు సంపాదించుకున్న రేవంత్ రెడ్డి… హుటాహుటున తుమ్మలతో భేటీ అయ్యారు. తుమ్మల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే పాలేరు టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రామిస్ చేశారని అంటున్నారు.

దీంతో ఇప్పుడు పాలేరు నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఈ స్థానం నుంచే పోటీ చేస్తున్నట్లు గతంలో ప్రకటించిన షర్మిళే ఇక్కడ నుంచి పోటీ చేస్తారా.. లేక, తుమ్మలకే ఛాన్స్ ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో… కాంగ్రెస్ పార్టీలో ఈ పాలేరు నియోజకవర్గం ఎలాంటి కొత్త సమస్యలు తెచ్చిపెట్టబోతుందో అనే చర్చ తెరపైకి వచ్చింది.