మునుపెన్నడూ లేనిరీతిలో.. అధికార బీఆరెస్స్ కు వణుకుపుట్టే స్థాయిలో.. తెలంగాణలో బీఆరెస్స్ కు ప్రత్యామ్నాయం తామే అనే మాటకు సార్ధకత కల్పించే లెవెల్ లో ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహించింది. ఈ సభకు ఈ మధ్యకాలంలో ఎక్కడా రాని విధంగా జనం హాజరయ్యారు. ఎంత తరలించారు అని విపక్షాలు వాదించినా… తరలిస్తే వచ్చే జనాలుగా అక్కడ జనం కనిపించకపోవడం గమనార్హం!
అవును… ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ సభ సక్సెస్ అయ్యిందని, ఆ వేడి ఎక్కడా తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలకు పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ సభా వేదికపై మైకందుకున్న రాహుల్… మోడీ – కేసీఆర్ లపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఒకపక్క వారిపై విమర్శలు చేస్తూనే ఒక కీలక హామీని తెరపైకి తెచ్చారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం దూకుడుమీదున్న కాంగ్రెస్ పార్టీలో మరింత ఉత్సాహం నింపేలా జరిగిన ఖమ్మం సభలో మైకందుకున్న రాహుల్… “తెలంగాణలో బీజేపీ పని అయిపోయింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్స్, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉంటుంది” అని మొదలుపెట్టారు. అనంతరం బీఆరెస్స్ అనేది బీజేపీకి బీ టీం అని పునరుధ్ఘాటించిన ఆయన… పార్లమెంటులో ఎన్నోసార్లు బీజేపీకి బీఆరెస్స్ సహకరించిందని గుర్తుచేశారు.
రాష్ట్రం కోసం ఎన్నో వర్గాలు కలలు కన్నాయని.. పేదలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఇలా ఎందరో తెలంగాణ కోసం కలలు కన్నారని.. ఫలితంగా తెలంగాణ అనేది ఒక స్వప్నంగా ఉంటే.. దానిని కాంగ్రెస్ పార్టీ సాకారం చేసిందని రాహుల్ చెప్పారు. కానీ కేసీఆర్ నాయకత్వంలోని బీఆరెస్స్ ప్రభుత్వం 9 ఏళ్లలో ఆ కలలన్నింటినీ ధ్వంసం చేసిందని రాహుల్ గాంధీ విమర్శించారు.
ఈ సందర్భంగా ఎన్నికల శంఖారావాన్ని పూరించిన రాహుల్ ఈ సభా వేదికపైనుంచి కీలక హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు రూ.4వేల పెన్షన్ అందిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. అలాగే పోడు భూములన్నీ ఆదివాసీలు, గిరిజనులకే చెందేలా పట్టాలు పంపిణీ చేస్తామని, ధరణిని కూడా రద్దు చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు.
అనంతరం తాను యాత్ర పూర్తి చేసిన తర్వాత మల్లు భట్టి విక్రమార్క తెలంగాణలో వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని.. ఆయన ఆ యాత్రలో బలహీనులకు, పేదలకు అండగా ఉంటామనే భరోసా ఇచ్చారని రాహుల్ ప్రశంసించారు. ఇదే క్రమంలో… పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నానని ప్రకటించిన ఆయన… కాంగ్రెస్ నుంచి వెళ్లిన వారికి పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు.
ఏది ఏమైనా… ఖమ్మం జిల్లాలో ఆదివారం జరిగిన “తెలంగాణ జన గర్జన” సభ తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పుకు నాంధి అని చెప్పొచ్చనేది పరిశీలకుల మాటగా ఉంది. మరి ఇదే స్థాయిలో రాబోయే ఎన్నికల్లో జనం రియాక్ట్ అవుతారా.. కాంగ్రెస్ సత్తా చాటుతుందా.. లేక, బీఆరెస్స్ హ్యాట్రిక్ కొడుతుందా అనేది వేచి చూడాలి!