టిఆర్ఎస్ కు తెలంగాణ కాంగ్రెస్ రివర్స్ పంచ్

తెలంగాణ ముందస్తు ఎన్నికల ఫలితాలు వచ్చాయి. టిఆర్ఎస్ జోష్ మీదుండగా కాంగ్రెస్ దిగాలుపడుతున్నది. అయితే కారు వేగం తగ్గకుండా చూసుకుంటున్నది టిఆర్ఎస్. టిఆర్ఎస్ స్కెచ్ వేయడంతో ఇద్దరు ఇండిపెండెంట్లు టిఆర్ఎస్ లోకి ఫిరాయించారు. మరింత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిరాయించేందుకు రెడీగా ఉన్నట్లు టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా ఎన్నికల ముందు టిఆర్ఎస్ పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నలుగురు ఎమ్మెల్సీలపై వేటు వేయాలని టిఆర్ఎస్ పార్టీ శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కు ఫిర్యాదు చేసింది. అందులో కొండా మురళి, యాదవ రెడ్డి, రాములు నాయక్, భూపతిరెడ్డి లపై అనర్హత వేటు వేయాలని కోరింది. అయితే టిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ రివర్స్ పంచ్ ఇచ్చింది. ఆ వివరాలేంటో చదవండి.

టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎన్నికల ముందు నలుగురు ఎమ్మెల్సీలు ఫిరాయించారు. వారందరిపైనా వేటు వేయాలని టిఆర్ఎస్ ఇప్పటికే శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుపై  24 గంటలు గడవకముందే స్వామిగౌడ్ ఆ నలుగురు ఎమ్మెల్సీలకు నోటీసులు కూడా జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. వారికి వారం రోజుల గడువు ఇచ్చారు ఛైర్మన్. వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే వెంటనే తేరుకున్న కాంగ్రెస్ పార్టీ రివర్స్ ఎటాక్ కు దిగింది. ఎమ్మెల్సీలు తమ పార్టీలోకి మాత్రమే ఫిరాయించలేదని, టిఆర్ఎస్ లోకి కూడా ఫిరాయించారని గుర్తు చేసింది. గతంలోనే ఈ విషయమై ఫిర్యాదు చేసినా ఛైర్మన్ పెడచెవిన పెట్టినట్లు ఆరోపించింది. తాజాగా టిఆర్ఎస్ పార్టీ కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన విషయాన్ని కాంగ్రెస్ గుర్తు చేసింది.

కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్సీ

కాంగ్రెస్ పార్టీకి చెందిన నాగర్ కర్నూలు నాయకుడు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఎన్నికల ముందే టిఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే ఇప్పుడు ఆయన మీద సయితం వేటు వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు శాసనమండలి ఛైర్మన్ కు కాంగ్రెస్ ఎల్పీ నేత షబ్బీర్ అలీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇప్పుడ ఆ నలుగురి మీద వేగంగా వేటు వేస్తారని ప్రచారం సాగిన నేపథ్యంలో మరి కూచుకుళ్ల దామోదర్ రెడ్డి పరిస్థితి ఏంటన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

మేము ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు, టిఆర్ఎస్ చేస్తే నోటీసులా : షబ్బీర్ అలీ

శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కు ఫిర్యాదు చేసిన తర్వాత షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే… కాంగ్రెస్ నుండి గెలిచి టీఆర్ఎస్ లోకి పిరాయించిన దామోదర రెడ్డి పై చర్యలు తీసుకోవాలి. దామోదర్ రెడ్డి పార్టీ ఫిరాయింపు వషయమై పూర్తి సాక్షాధారాలను మండలి చైర్మన్ స్వామిగౌడ్ కు అందిస్తున్నాం. ఈ ఎన్నికల తర్వాత కూడా ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆరే. టీడీపీ, కాంగ్రెస్, వైసిపి, సీపీఐ  ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను టిఆర్ఎస్ లో కేసిఆర్ చేర్చుకుంది నిజం కాదా?  ఫిరాయింపు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేసిన నాలుగున్నర ఏళ్ళు కేసీఆర్ పట్టించుకోలేదు. 

ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన ముగ్గురు టీఆరెస్ఎస్ ఎమ్మెల్సీలకు నోటిస్ లు ఇచ్చిన చైర్మన్ కు గతంలో మేము ఇచ్చిన ఫిర్యాదుల ను ఎందుకు పట్టించుకోలేదో చెప్పాలి. పార్టీ ఫిరాయించిన తలసాని ని నాలుగున్నర ఏళ్లు మంత్రిగా కొనసాగించారు. ఇది ప్రజలు మరిచిపోలేదు. ఇప్పటికైనా ఫిరాయింపుల పై కేసీఆర్ చిత్తశుద్ధి ఉంటే టీఆరెస్ లో చేరిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలి. 

షబ్బీర్ అలీ, తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేత

రాజకీయాలో గెలుపు ఓటమిలు సహజం. ఓడిపోయినంత మాత్రాన ఇంట్లో ఉండం. ప్రజల పక్షాన ఉంటాం. నిరుద్యోగ భృతిపై అప్పుడే కేసీఆర్ మాటమార్చారు. ఉద్యోగుల వయోపరిమితి, రైతు రుణమాఫీ పైనా కేసీఆర్ మాటమార్చారు. కేసీఆర్ ది అబద్దాల కోరు ప్రభుత్వం అని తేలిపోయింది. మూడు రాష్ట్రాల్లో రైతు రుణమాఫీ పై తొలిసంతకం చేసిన ఘనత కాంగ్రెస్ ది. కాంగ్రెస్ క్రెడిబిలిటీ ఏంటో …కేసీఆర్ క్రెడిబిలిటీ ఎంతో జనం అర్థం చేసుంటున్నారు. 

పంచాయితీల్లో బీసీ రిజర్వేషన్ లపై ప్రభుత్వం ఎందుకు పిటిషన్ వేయలేదు .? ప్రభుత్వం తీరుతో వేయి మంది బీసీ సర్పంచ్ లు, 9 వేల మంది వార్డ్ మెంబర్ లు నష్టపోతున్నారు. బీసీలు మేల్కొని ..ప్రభుత్వం తీరును ప్రశ్నించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో గడబిడి జరిగింది. పోలైన ఓట్లకు కౌంటింగ్ ఓట్లలో తేడావచ్చింది నిజం. వేలసంఖ్యలో ఓట్ల తేడా ఎలా వచ్చిందో ఈసీ, ప్రభుత్వం చెప్పాలి. ఓటింగ్ పర్సెంటేజ్ రాత్రికి రాత్రి 11శాతం ఎలా పెరిగింది?